KCR: కాంగ్రెస్‌తో ప్రమాదం పొంచి ఉంది

KCR: కాంగ్రెస్‌తో ప్రమాదం పొంచి ఉంది
ఏమరుపాటుతో మళ్లీ దళారుల రాజ్యం... జనగామ, భువనగిరి సభల్లో సీఎం కేసీఆర్‌

కాంగ్రెస్‌తో ప్రమాదం పొంచి ఉందని.. ప్రజలు ఏమాత్రం ఏమరుపాటు వహించినా మళ్లీ దళారుల రాజ్యం వస్తుందని బీఆర్‌ఎస్‌ అధినేత KCR హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంలో జనగామ, భువనగిరి సభలకు హాజరైన KCR తమ హయాంలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించారు. అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందని, పాత పథకాలు కొనసాగిస్తూనే కొత్త పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. జనగామ, భువనగిరి సభలకు హాజరైన కేసీఆర్‌... భారాస చేపట్టిన అభివృద్ధి వివరిస్తూ.. కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు.

పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపిస్తే చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేస్తామని కేసీఆర్‌ హమీ ఇచ్చారు. ఎన్నికల వేళ ఆపద మొక్కులు మొక్కేవారిని నమ్మొద్దని... నిరంతర కరెంటు, రైతుల భూములు భద్రంగా ఉండాలంటే కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలపాల్సిన అవసరం ఉందన్నారు. జనగామ పర్యటన అనంతరం, భువనగిరి చేరుకున్న కేసీఆర్‌.. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు హాజరయ్యారు. ఒకప్పుడు కరవు ప్రాంతమైన భువనగిరిలో నేడు పుష్కలంగా పంటలు పండుతున్నాయని... తెలంగాణ రాకుంటే భువనగిరి జిల్లా అయి ఉండేది కాదని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే.. ధరణి పోయి మళ్లీ దళారుల రాజ్యం వస్తుందని పునరుద్ఘాటించారు.

ఓట్ల కోసం మేం అబద్ధాల మేనిఫెస్టో పెట్టలేదని కేసీఆర్‌ అన్నారు. దేశంలో దళితబంధు పెట్టాలనే ఆలోచన ఏ సీఎంకు అయినా వచ్చిందా? అని ప్రశ్నించారు. దేశంలో దశాబ్దాల క్రితమే దళితబంధు పెట్టి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ఒకప్పుడు కరువు ప్రాంతమైన భువనగిరిలో ఇప్పుడు పుష్కలంగా పంటలు పండుతున్నాయని సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ రాకుండా ఉంటే భువనగిరి జిల్లా అయి ఉండేది కాదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం భువనగిరిలో అరాచక శక్తులను పెంచి పోషించిందని విమర్శించారు. ఓటు మన తలరాతను మార్చేస్తుందని, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుందని కేసీఆర్‌ అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎంతో బలమైన ఆయుధం మన ఓటని. ఓటును ఎలా వేస్తామో.. మన కర్మ అలానే ఉంటుందన్నారు. మంచి, చెడు గుర్తించి ప్రజలు ఓటేయాలని, అలా చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఎన్నికలప్పుడు వచ్చి ఆపద మొక్కులు మొక్కేవారిని నమ్మొద్దని కేసీఆర్‌ అన్నారు.


Tags

Next Story