సినీ పరిశ్రమను కాపాడుకుంటాం: కేసీఆర్

తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కొవిడ్ కారణంగా షూటింగులు ఆగిపోయి, థియేటర్లు మూసి వేయడం వల్ల పరిశ్రమకు, కార్మికులకు జరిగిన నష్టం నుంచి కోలుకోవడానికి ప్రభుత్వ పరంగా రాయితీలు, మినహాయింపులు ఇస్తామని వెల్లడించారు. సినీ హీరోలు చిరంజీవి, నాగార్జున, ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు నారాయణ్ దాస్, నిర్మాతల సంఘం అధ్యక్షుడు సి.కళ్యాణ్, చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో సమావేశమయ్యారు. కోవిడ్ కారణంగా జరిగిన నష్టాన్ని వివరించారు. ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరగా.. కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.
రాష్ట్రానికి పరిశ్రమలు తరలి రావడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందని... సినీ పరిశ్రమను కాపాడుకోకపోతే ఎలా అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. దేశంలో ముంబై, చెన్నైతో పాటు హైదరాబాద్‌లోనే పెద్ద సినీ పరిశ్రమ ఉందని అన్నారు. లక్షలాది మందికి సినీ పరిశ్రమ ద్వారా ఉపాధి దొరుకుతుందని చెప్పారు. కొవిడ్ కారణంగా సినీ పరిశ్రమకు ఇబ్బంది కలిగిందని, ఈ పరిస్థితుల్లో పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు.
ప్రభుత్వం, సినిమా పరిశ్రమ పెద్దలు కలిసి పరిశ్రమను కాపాడుకోవడానికి సంయుక్తంగా ప్రయత్నాలు చేయాలని కేసీఆర్ చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోలోనూ సినిమా పరిశ్రమకు సంబంధించిన అంశాలు ప్రస్తావిస్తామని కేసీఆర్ తెలిపారు. త్వరలోనే హీరో చిరంజీవి ఇంట్లో మరోసారి సమావేశమై, సినిమా పరిశ్రమ అభివృద్ధిపై మరింత విస్తృతంగా చర్చించాలని నిర్ణయించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com