ఆ పాట నేను వంద సార్లు విన్నా.. మీరు కూడా విని పేదల కష్టాలు తీర్చండి : కేసీఆర్

CM KCR Congratulations To Ghmc New Mayor
విభిన్న ప్రాంతాలు, విభిన్న సంస్కృతులకు చెందిన ప్రజలు నివాసముంటున్న హైదరాబాద్ అసలు సిసలైన విశ్వనగరమన్నారు సీఎం కేసీఆర్. ఈ సిటీ వైభవాన్ని మరింత పెంచే విధంగా కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు పాటుపడాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా రెడ్డి, టిఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రగతి భవన్ లో కేసీఆర్‌ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని అభినందించారు.
కోట్లాది మందిలో కేవలం కొద్ది మందికి మాత్రమే సందర్భం కలిసి వచ్చి ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశం వస్తుందని.. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజా జీవితంలో మంచి పేరు తెచ్చుకోవడం గొప్ప విషయమని అన్నారు. మంచిగ ఉంటేనే బట్టకాల్చి మీదేసే ఈ కాలంలో కొద్దిగా అవకాశం ఇస్తే చాలా చెడ్డపేరు వస్తుందని కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అని ముఖ్యమంత్రి హితవు పలికారు. సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నించాలి అని చెప్పారు.
గల్లీ చిన్నది గరీబోళ్ల కథ పెద్దది అనే గోరటి వెంకన్న పాటను ఈ సందర్భంగా కేసీఆర్ కార్పొరేటర్ల దగ్గర ప్రస్తావించారు. తాను వంద సార్లు విన్నానని అందులో బస్తీల్లో ఉండే పేదల కష్టాలు, గోసలున్నాయని వాటిని అర్థం చేసుకోని ముందుకువెళ్లాలని సూచించారు. మినీ ఇండియాలాంటి నగరంలో పేదలను ఆదరించి..బస్తీ సమస్యలు తీర్చాలని అదే ప్రధాన లక్ష్యం కావాలన్నారు కేసీఆర్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com