నియంత్రిత సాగుపై వెనక్కి తగ్గిన కేసీఆర్ సర్కారు

నియంత్రిత సాగుపై వెనక్కి తగ్గిన కేసీఆర్ సర్కారు
దేశంలో అమలవుతున్న కొత్త చట్టాలు కూడా రైతులు.. తమ పంటలను ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెబుతున్నాయన్నారు కేసీఆర్.

తెలంగాణలో పంటల నియంత్రిత సాగు విధానంపై కేసీఆర్‌ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. నియంత్రిత సాగు అవసరం లేదని స్పష్టం చేసింది. రైతులు ఏ పంటలు వేయాలనేది ఇక వారి ఇష్టమేనన్నారు సీఎం కేసీఆర్‌. అంతేకాదు.. పంటను ఎక్కడ అమ్ముకుంటే.. మంచి ధర వస్తుందో అక్కడ అమ్ముకోవచ్చన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల నిర్మాణం జరుగుతోందని వీటిలో రైతులు, వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు సమావేశం కావాల్నారు. స్థానిక పరిస్థితులు, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఏ పంటలు వేయాలనే విషయంలో అక్కడే నిర్ణయాలు తీసుకోవాలన్నారు సీఎం కేసీఆర్. మద్దతు ధర వచ్చేందుకు అనువైన వ్యూహం ఎక్కడికక్కడ రూపొందించుకోవాలన్నారు. రైతు బంధు పథకంపై ప్రగతి భవన్‌లోసమీక్ష సమావేశం నిర్వహించారు సీఎం కేసీఆర్‌. దేశంలో అమలవుతున్న కొత్త చట్టాలు కూడా రైతులు.. తమ పంటలను ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెబుతున్నాయని.. కాబట్టి ప్రభుత్వమే గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదన్నారు. వీటిని రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

ఇక తెలంగాణ ఏర్పడ్డ నాటి నుంచి వివిధ రకాల పంటల కొనుగోళ్ల వల్ల చాలా నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు పంటల కొనుగోళ్ల వల్ల 7 వేల 500 కోట్లు నష్టం వచ్చిందన్నారు. ఈ పంటలకు మార్కెట్లో డిమాండ్ లేకపోవడం వల్ల ప్రభుత్వం తక్కువ ధరకు అమ్మాల్సి వస్తోందన్నారు. ఏటా ఇదే పరిస్థితి తలెత్తుతోందని కేవలం ధాన్యం కొనుగోళ్ల వల్లనే దాదాపు 4వేల కోట్లు నష్టం వచ్చినట్లు తెలిపారు. కరోనా వల్ల రైతులు నష్టపోకూడదని ప్రభుత్వం.. గ్రామాల్లోనే సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి పంటల్ని కొనుగోలు చేసిందన్నారు. ప్రతిసారి ఇలా చేయడం సాధ్యం కాదని, కొనుగోళ్లు – అమ్మకాలు ప్రభుత్వం బాధ్యత కాదని, కాబట్టి వచ్చే ఏడాది నుండి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం సాధ్యపడదన్నారు.


Tags

Read MoreRead Less
Next Story