KCR: కాంగ్రెస్‌కు 20 సీట్లు మించి రావు

KCR: కాంగ్రెస్‌కు 20 సీట్లు మించి రావు
మధిర, వైరా, డోర్నకల్‌, సూర్యాపేట సభల్లో కేసీఆర్‌ ధీమా... కాంగ్రెస్‌ వస్తే భూ మేతే అని విమర్శలు

బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే అభివృద్ధి ముందుకెళ్తుందన్న కేసీఆర్‌ దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ తయారైందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అధికారానికి వస్తే రాష్ట్రం ఆగమవుతుందని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగామధిర, వైరా, డోర్నకల్‌, సూర్యాపేట నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలకు హాజరైన ముఖ్యమంత్రి KCR... కాంగ్రెస్‌, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. ధరణి తీసేసి కాంగ్రెస్‌ తెచ్చేది భూమాత కాదు, భూమేత అని మండిపడ్డారు. మధిర సభలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే ధాన్యం ఉత్పత్తి 4 కోట్ల టన్నులకు చేరుతుందని... కేసీఆర్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. సూర్యాపేట నియోజకవర్గంలో ఫ్లోరైడ్ సమస్యను తామే పరిష్కరించామని గుర్తుచేశారు.


కాంగ్రెస్‌ పార్టీకి ఈ ఎన్నికల్లో 20 సీట్లే వస్తాయని ముఖ్యమంత్రి KCR జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ హయాంలో కష్టాలు, కన్నీళ్లేనన్న ముఖ్యమంత్రి మోటార్లకు మీటర్లు పెట్టాలన్న భాజపాతో రాష్ట్రానికి ఒరిగేదేంలేదని విమర్శించారు. ధరణి తీసేసి కాంగ్రెస్‌ తెచ్చేది భూమాత కాదు భూమేత అని మండిపడ్డారు. మార్పు పేరుతో కాంగ్రెస్‌ ఏమార్చే ప్రయత్నం చేస్తోందని కేసీఆర్‌ ఆరోపించారు. ఒకనాడు ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెసని కేసీఆర్‌ ధ్వజమెత్తారు. తెలంగాణను బలవంతంగా తీసుకెళ్లి ఆంధ్రలో కలిపి ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ సర్కారు పాలనలో తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా తయారైందన్న కేసీఆర్‌... కాంగ్రెస్‌ దశాబ్దాలుగా దళితుల్ని ఓటు బ్యాంకుగానే వాడుకుందని ధ్వజమెత్తారు.


ఈ ఎన్నికల్లో బాగా ఆలోచించి ఓటు వేయాలి.. ఆషామాషీగా దుర్మార్గులకు ఓటేస్తే ఐదేళ్లు ఏడ్సుక సావాలి’ అని బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ హెచ్చరించారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయినా ప్రజాస్వామ్య పరిణితి రావాల్సినంత రాలేదని కేసీఆర్‌ విచారం వ్యక్తం చేశారు. పరిణితి వచ్చిన దేశాలు అభివృద్ధిలో మనకంటే వేగంగా దూసుకుపోతున్నాయన్నారు. ఆ పరిస్థితి మన దేశంలో రావాలంటే ఆలోచించి సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలన్నారు. అభ్యర్థితో పాటు అభ్యర్థి వెనుక పార్టీ గుణగణాలను పరిగణలోకి తీసుకుని ఆయుధం లాంటి ఓటుహక్కుతో సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. తద్వార రాష్ట్రం ఐదేళ్ల భవిష్యత్‌ ఉంటుందని చెప్పారు. బీఆర్‌ఎస్‌ పుట్టిందే తెలంగాణ, తెలంగాణ ప్రజల హక్కులు, తెలంగాణ రక్షణ కోసమన్న విషయాల్ని తండా, గ్రామాల్లో చర్చకు పెట్టి రాయోదే.. రత్నమేదో... ఓటరు గుర్తించేలా చూడాలన్నారు. 50 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో ప్రజల కళ్ల గురించి ఎప్పుడైనా ఆలోచించారా..! అంటూ సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. తాము 3 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించి 80 లక్షల మందికి కంటి అద్దాలు ఉచితంగా పంపిణీ చేశామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story