KCR: విపక్షాలతో జాగ్రత: కేసీఆర్‌

KCR: విపక్షాలతో జాగ్రత: కేసీఆర్‌
సిరిసిల్ల, సిద్ధిపేట జరిగిన ప్రజాఆశీర్వాద సభల్లో పాల్గొన్న KCR... విపక్షాలతో పెద్ద ప్రమాదం పొంచి ఉందన్న సీఎం...

రైతుబంధు, ధరణి పోర్టల్ తీసేసి రైతులను ఇబ్బంది పెట్టాలని కాంగ్రెస్‌ చూస్తోందని బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి KCR ఆరోపించారు. ప్రజాఆశీర్వాద సభల్లో భాగంగా సిరిసిల్ల, సిద్ధిపేట జరిగిన బహిరంగ సభల్లో KCR పాల్గొన్నారు. దళితబంధు, బీసీలకు ఆర్థికసాయం.. నిరంతరం సాగే పథకాలని.. విడతలవారీగా అన్ని కుటుంబాలకు ఆర్థికసాయం అందిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. విపక్ష పార్టీలతో పెద్ద ప్రమాదం పొంచి ఉందని, రైతులంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. కలలో ఊహించని విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా అయ్యిందని, కాళేశ్వరం జలాలతో కరీంనగర్ జిల్లాను సస్యశ్యామలం చేశామన్నారు.


గతంలో ఏడుగురు చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఎంతో చలించిపోయానన్న సీఎం... చేనేత కార్మికులకు పని కల్పించేందుకే బతుకమ్మ చీరల పథకం అమలు చేస్తున్నామన్నారు. కేటీఆర్‌ చేనేత శాఖ మంత్రి అయిన తర్వాత సిరిసిల్ల రూపు రేఖలు మారిపోయాయని కేసీఆర్‌ అన్నారు. షోలాపూర్‌ ఎలా ఉంటుందో.. సిరిసిల్లను కూడా అలా చేయాలనేదే తమ ప్రయత్నమన్నారు. బతుకమ్మ చీరల పంపిణీ కేవలం చేనేత కార్మికులను ఆదుకునేందుకే అన్న సీఎం... చివరికి ఆ పథకాన్ని కూడా రాజకీయం చేశారన్నారు. నచ్చకపోతే చీరలు తీసుకోవద్దని.. అంతే కానీ, చీరల పంపిణీని రాజకీయం చేయొద్దని ప్రతిపక్షాలకు కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. సభను ఉద్దేశించి ప్రసంగించిన అభ్యర్థి హరీశ్‌రావు.. దశాబ్దం క్రితం రాష్ట్రంలో కరవు తాండవించిందని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్‌.. సిద్దిపేటలో కరవు అనే పదాన్ని శాశ్వతంగా తొలగించి.. తెలంగాణలో వేసవికాలం కూడా వర్షాకాలం మాదిరే ఉండేలా చేశారన్నారు. సిద్దిపేటను అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన హరీశ్‌రావుపై కేసీఆర్‌ ప్రశంసలు కురిపించారు. ఈ ఎన్నికల్లో లక్ష మెజార్టీ రికార్డును సిద్దిపేట ప్రజలు బద్దలుకొట్టాలని పిలుపునిచ్చారు.

ప్రజా ఆశీర్వాద సభల షెడ్యూల్‌లో భాగంగా ముఖ్యమంత్రి తన 70 ఏళ్ల జీవితంలో సిరిసిల్లలో కనీసం వందసార్లు తిరిగానని. ఒకప్పుడు సిరిసిల్ల ప్రాంతాన్ని చూస్తే కన్నీళ్లు వచ్చేవని... ఇప్పుడు అప్పర్‌ మానేరులో చూస్తే ఏడాదంతా నీరు ఉంటోందన్నారు. రేషన్‌కార్డు ఉన్న పేదలందరికీ నాణ్యమైన సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. భవిష్యత్‌లో సిరిసిల్ల మంచి విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందుతుందన్నారు.మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత సిరిసిల్ల నేతన్నల జీవితాలు మారాయన్నారు. ప్రజా ఆశీర్వాద సభకు భారీగా తరలి వచ్చిన గులాబీ శ్రేణులతో సిరిసిల్ల జనసంద్రమైంది.

Tags

Read MoreRead Less
Next Story