Telangana: ముందస్తు ఎన్నికలు.. కేసీఆర్‌ను వెంటాడుతున్న అనుమానాలు

Telangana: తెలంగాణలో ఇప్పుడంతా.. ముందస్తు ఎన్నికల గురించే చర్చ! ఇప్పటికే సీఎం కేసీఆర్ ముందస్తుకు వెళ్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఓ వైపు షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని పార్టీ నేతలకు చెబుతున్నా.. కేసీఆర్ వ్యూహాలు ఇందుకు భిన్నంగా ఉంటున్నాయి.
ఇటీవల పాలనపై ప్రత్యేక దృష్టి సారించిన కేసీఆర్.... సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షలు, ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, రోడ్ల నిర్మాణానికి నిధులు వంటివి ప్రకటిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ స్పీడ్ పెంచారు. వరుసగా అభివృద్ధిపనులు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఇలా సంక్షేమం, అభివృద్ధిలో దూసుకెళ్తుండటంతో కేసీఆర్ ముందస్తుకు వెళ్లడం ఖాయమనే చర్చ జరుగుతోంది. అంతేకాదు... ముందస్తుకు వెళితే విపక్షాలు బలపడకుండా దెబ్బకొట్టవచ్చనేది కూడా కేసీఆర్ వ్యూహాంగా కనిపిస్తోంది.
అయితే ముందస్తుకు వెళ్తే... షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయా? అనే అనుమానం కేసీఆర్‌కు వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. ముందస్తుకు వెళ్తితే అసెంబ్లీని రద్దు చేయాలి. ఆ తరువాత రాజ్యాంగం ప్రకారం 6 నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలి. అయితే... బీజేపీతో కేసీఆర్‌కు తీవ్రమైన వైరం ఏర్పడి నేపథ్యంలో.. అసెంబ్లీని రద్దు చేస్తే 3 నెలల్లోనే ఎన్నికలు పెట్టే పరిస్థితి ఉండకపోవచ్చన్న అనుమానం ఉంది.
6 నెలల గరిష్ఠ పరిమితిని ఈసీ ఉపయోగించుకునే అవకాశమూ ఉంటుంది. కర్ణాటకతో కలిపి ఎన్నికలు పెడతారన్న గ్యారంటీ కూడా లేదు. అవసరమైతే ఆ తర్వాత నిర్వహించే పరిస్థితుల్ని కూడా తీసుకురావొచ్చు. అదే జరిగితే కేసీఆర్ ప్రభుత్వం 6 నెలలపాటు ఆపద్ధర్మ ప్రభుత్వంగా ఉండాల్సి వస్తుంది. ఆపద్ధర్మ సీఎంగా కేసీఆర్ కొనసాగితే... తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. పేరుకు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నా.. అధికారాలు మాత్రం నామమాత్రంగా ఉంటాయి.
విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. బడ్జెట్ కేటాయింపులు చేయడం, ఉత్తర్వుల జారీ కుదరదు. భారీ ప్రాజెక్టులు ప్రకటించడం, పన్నుల పెంపు, నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయడానికి వీలుండదు. ఉద్యోగుల పదోన్నతులు, బదిలీలు కూడా చేయలేని పరిస్థితి. 6 నెలల ఇలా చేతులు కట్టేసుకుని ఉండాల్సిందే. ఇదే జరిగితే... గవర్నర్ పట్టు పెరిగి కేంద్రం మరింత కటువుగా వ్యవహరించే అవకాశం ఉంది. మరి.... ఆపద్ధర్మ సీఎంగా కేసీఆర్.... బలమైన కేంద్రాన్ని ఎదుర్కోగలరా? అధికారులు ఇప్పుడు సహకరిస్తున్నట్లుగా అప్పుడు సహకరిస్తారా? అనేది ఆందోళన కలిగిస్తోంది. ఈ కారణాలే కేసీఆర్‌ను ముందస్తుపై పునరాలోచనలో పడేలా చేస్తున్నట్లు సమాచారం.
అయితే ఇలాంటి అనుమానాలు ఉన్నా.... సీఎం కేసీఆర్ మాత్రం ధీటుగానే ముందడుగులు వేస్తుండటం విశేషం. సంక్షేమం, అభివృద్ధితో పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. అటు ఢిల్లీలో BRS కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులుగా సిటింగ్‌లే ఉంటారని కేసీఆర్ ప్రకటించడంతో టికెట్ల విషయలో స్పష్టత వచ్చేసింది. అటు బీజేపీకి అభ్యర్థుల్లో కొరత ఉంది. కాంగ్రెస్‌కు బలమైన నేతలు ఉన్నా ఆ పార్టీలో అంతర్గత పోరు కొనసాగుతోంది.
ఇప్పటికే కాంగ్రెస్ కమిటీలతో.. కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇలాంటి పరిరిస్థితుల్లో ఈ పార్టీలు రెడీ అయ్యేలోపే ముందస్తుకు వెళితే సక్సెస్ అవుతామని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటం, మరింత ఆగితే ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే జరుగుతున్న సీబీఐ, ఈడీలు దాడులు.... మరింత పెరిగితే ఇబ్బందులు పడే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. దీంతో ఆ పరిస్థితి రాకముందే ఎన్నికలకు వెళ్లడం మంచిదనేది కేసీఆర్ వ్యూహమంటున్నారు.
ముందస్తుకు వెళితే కర్ణాటకతోపాటే తెలంగాణలోనూ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందనేది అంచనా. కర్ణాటక ఎన్నికలు బీజేపీకి, కాంగ్రెస్‌కు ప్రతిష్ఠాత్మకమైనవి కావడంతో ఆ రెండు పార్టీలు ఆ రాష్ట్రంపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతాయని అప్పుడు తెలంగాణలో సులభంగా గెలవచ్చన్నది ఆలోచనగా కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌తో వెళ్తుండటం వల్ల లోక్‌సభ ఎన్నికల్లో మరిన్ని ఎంపీ సీట్లు గెలుచుకోవవచ్చని భావిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి.. ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా.. ధీటుగా వ్యూహాలు మార్చి.. సక్సెస్ కావడంలో కేసీఆర్ దిట్ట. మరి ప్రస్తుతం ఎలాంటి అడుగులు వేస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com