నేడు నిర్మల్‌లో సీఎం కేసీఆర్ పర్యటన

నిర్మల్ జిల్లా కేంద్రంలో ఇవాళ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. నూతనంగా నిర్మించిన కలెక్టరేట్‌ను ప్రారంభించనున్నారు. దీంతో పాటు డబుల్ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారులకు కూడా సీఎం ఇండ్లను పంపిణీ చేయనున్నారు. ఆ తరువాత ఆయన నేరుగా కొండాపూర్ వద్ద నిర్మించిన బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి ఎల్లపెల్లి రోడ్డు క్రషర్ స్థలంలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మొత్తం సీఎం కేసీఆర్ పర్యటన బాధ్యతలను తన భుజాలపై వేసుకొని వారం రోజుల నుంచి ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం పాల్గొనే బహిరంగ సభను కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించాలని తలపెట్టారు.
ఇప్పటికే నిర్మల్ పట్టణాన్ని గులాబీమయం చేశారు. భారీ ఫ్లెక్సీ బ్యానర్‌లు, కటౌట్‌లు, హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఈ భారీ హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలతో నిర్మల్ పట్టణమంతా గులాబీమయంగా మారిపోయింది. దాదాపు 2500 మంది పోలీసులు సీఎం సభ కోసం బందోబస్తు చేపట్టారు. పట్టణ నలుమూలల నుంచి జనం కేసీఆర్ సభకు భారీగా తరలివచ్చే అవకాశాలు ఉండడంతో రెండు కిలో మీటర్ల దూరంలోనే వాహనాల పార్కింగ్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com