గ్రేటర్ ప్రజలకు సీఎం కేసీఆర్ హమీల జల్లు

గ్రేటర్ ప్రజలకు టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హమీల జల్లు కురిపించారు. ఈ మేరకు ఆకర్షణీయ పథకాలతో జీహెచ్‌ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. వరద బాధితులకు పరిహారం, మౌలిక సదుపాయాల కల్పన, ఐటీ విస్తరణ వంటి పలు అంశాల్ని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.
గ్రేటర్ పరిధిలో 20వేల లీటర్ల వరకు తాగు నీరు ఉచితంగా అందిస్తామని, నీటి బిల్లులు రద్దు చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణలోని మిగతా మున్సిపాల్టీలకూ త్వరలోనే ఉచిత మంచినీటి పథకం అమలు చేస్తామని తెలిపారు. సెలూన్లు, దోబీ ఘాట్లు, లాండ్రీలకు ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. బస్తీల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతామని తెలిపారు. కరోనా కాలానికి మోటార్ వానహ పన్ను రద్దు చేస్తామని వెల్లడించారు.
వరద నివారణకు 12 వేల కోట్లతో మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. గోదావరితో మూసీ నదిని అనుసంధానం చేస్తామని హామీ ఇచ్చారు. 5 వేల కోట్ల రూపాయలతో మూసీని సమూలంగా ప్రక్షాళన చేస్తామని తెలిపారు.
హైదరాబాద్ అర్బన్ లంగ్స్ స్పెస్‌కు అధిక ప్రాధాన్యత కల్పించామని కేసీఆర్ తెలిపారు. GHMCలో 185 చెరువులు, HMDA పరిధిలో 2700 చెరువులు సుందరీకరించామని తెలిపారు. కాలుష్య నివారణ కోసం ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం పెంచుతామని స్పష్టం చేశారు. 300 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశామని తెలిపారు. వరద బీభత్సం తీవ్రమైన బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తంచేశారు. సాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారి అభ్యర్థనలు పరిశీలిస్తున్నట్టు చెప్పారు.
ముత్యాల నగరానికి మరో మణిహారంగా రెండో దశలో రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో రైలు నిర్మాణం చేపడతామని కేసీఆర్ తెలిపారు. ఎస్‌ఆర్‌డీపీ రెండు, మూడు దశల్లో రోడ్లు, ఫ్లైఓవర్లు, కూడళ్లు అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఓఆర్‌ఆర్‌కు అవతల మరో రింగ్ రోడ్ నిర్మిస్తామని చెప్పారు. 10 కోట్ల రూపాయల లోపు బడ్జెట్ కలిగిన సినిమాలకు స్టేట్ GST రీఎంబర్స్‌మెంట్ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. TS బీపాస్‌ను మరింత పటిష్టం చేస్తామని స్పష్టంచేశారు.
ఐటీని హైదరాబాద్ నలువైపులా విస్తరిస్తామని కేసీఆర్ చెప్పారు. పేదల సొంతింటి కల సాకారం చేస్తామని తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కొనసాగిస్తామని చెప్పారు. టీఆర్‌ఎస్‌కు కాకుండా వేరే పార్టీలకు ఓటు వేసినా ఫలితం ఉండదని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com