KCR: 2024లో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే..

KCR: 2024లో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే..
రాష్ట్రాన్ని అద్భుతంగా ముందుకు తీసుకుపోతున్నామన్న ముఖ్యమంత్రి

ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్. ప్రజల చేతిలో ఉన్న విలువైన ఆయుధం ఓటు అని అన్నారు. మెదక్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. తలరాతను మార్చే ఓటును జాగ్రత్తగా వినియోగించుకోవాలన్నారు.

తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్రంలో కరెంట్, సాగునీరు, తాగునీరు లేదని.. ఇప్పుడు తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్‌గా ఉందన్నారు. సాగుకు 24 గంటల కరెంట్ ఇస్తున్న రాష్ట్రం మరొకటి లేదని కేసీఆర్ అన్నారు. ప్రజల డబ్బును రైతుబంధు రూపంలో వృథా చేస్తున్నానని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారని మండిపడ్డారు. రైతుబంధు ఉండాలంటే మళ్లీ బీఆర్ఎస్ గెలవాలని కేసీఆర్ స్పష్టం చేశారు. రైతులకు 24 గంటల కరెంట్‌ అవసరం లేదని రేవంత్‌రెడ్డి అన్నారని ధ్వజమెత్తారు. రైతులకు 3 గంటల కరెంట్ చాలని రేవంత్‌రెడ్డి అంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ వస్తే.. ధరణి తీసేస్తామని చెప్తున్నారని అన్నారు. ధరణి ఉండటం వల్లే రైతుబంధు డబ్బులు వస్తున్నాయని పేర్కొన్నారు. ధరణి ఉండటం వల్లే రైతుబీమా, ధాన్యం డబ్బులు వస్తున్నాయని వివరించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా విస్తృతంగా పర్యటిస్తున్న భారాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ బోధన్‌, నిజామాబాద్‌ అర్బన్‌, ఎల్లారెడ్డి, మెదక్‌లో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. పార్టీల చరిత్ర, నడవడిక చూసి ఓటు వేయాలని బోధన్‌ సభలో ప్రజలకు సూచించారు. పదేళ్లలో భారాస చేసిన అభివృద్ధి ప్రజల కళ్ల ముందు ఉందన్నారు. పొరపాటున కాంగ్రెస్‌ వస్తే దళారుల రాజ్యం వస్తుందని హెచ్చరించారు. తెలంగాణలో అన్ని మతాల వారిని సమానంగా చూస్తున్నామని తెలిపారు. భాజపా మతపిచ్చి లేపి పబ్బం గడుపుకోవాలని చూస్తోందని నిజామాబాద్‌ సభలో కేసీఆర్‌ ఆరోపించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ బీడీ కార్మికులకు పింఛను ఇవ్వట్లేదని.. ఒక్క తెలంగాణలోనే ఇస్తున్నట్లు చెప్పారు. ధరణి, 24గంటల కరెంటు వద్దంటున్న కాంగ్రెస్‌ను రైతులు మట్టి కరిపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ దేశంలో అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉందని మెదక్‌ సభలో కేసీఆర్‌ వివరించారు. ఇదే సమయంలో మెదక్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిపై విమర్శలు గుప్పించారు.

Tags

Next Story