CM KCR: దూకుడు పెంచిన సీఎం కేసీఆర్

CM KCR: దూకుడు పెంచిన సీఎం కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల, రామగుండం, ములుగు, భూపాలపల్లిలో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్న భారాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ తొమ్మిదిన్నరేళ్ల ప్రగతిని వివరిస్తూనే కాంగ్రెస్‌, భాజపాలపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఎవరి చేతుల్లో ఉంటేసురక్షితంగా ఉంటుందో ఆలోచించాలని ప్రజలకు సూచించారు. భారాస పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం, హక్కుల కోసం అని స్పష్టం చేశారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం, తెలంగాణకు ఒక్క నవోదయ పాఠశాల, మెడికల్‌ కాలేజీ ఇవ్వలేదన్నారు. అలాంటి పార్టీకి ఒక్క ఓటు కూడా వేయొద్దని ప్రజలను కోరారు. తెలంగాణకు కాంగ్రెస్ చేసింది శూన్యమని విమర్శించారు. 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ అప్పులు తీర్చలేక సింగరేణిలో 49 శాతం వాటాను కేంద్రానికి అమ్మారని మండిపడ్డారు.

గత ప్రభుత్వాలు పెండింగ్‌లో పెట్టిన పోడు భూముల సమస్యను పరిష్కరించి పోడు రైతులకు పట్టాలు ఇచ్చామని కేసీఆర్‌ గుర్తుచేశారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక గిరిజనేతరులకు కూడా పోడు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఐదేళ్లకోసారి జరిగే ప్రజాస్వామ్య పండుగలో ప్రజలే గెలవాలన్న కేసీఆర్‌ రాజకీయ పార్టీల దృక్పథం, చరిత్ర చూసి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

ములుగు ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ స్థానిక ఎమ్మెల్యే సీతక్కపై కీలక వ్యాఖ్యలు చేశారు. "ఆమె ఏ పార్టీలో అయినా ఉండొచ్చుగాక.. ముఖ్యమంత్రిని కలవాలి, ప్రభుత్వంతో మాట్లాడాలి, పనులు చేయించుకోవాలి.. కానీ ఆమె ఏనాడు ప్రభుత్వంతో మాట్లాడలేదు. మాకు తోచినవి, తెలిసినవి, మా పార్టీవాళ్లు చెప్పినవి చేశాను. ఆమె మాత్రం ఏదీ అడగదు." అని అన్నారు కేసీఆర్. ఇక్కడ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బడే నాగజ్యోతి ఎమ్మెల్యే అయితే ములుగు ఓ జ్యోతిలా వెలుగుతుందని చెప్పారు.

తెలంగాణలో పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అగ్ర నాయకులు రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిరోజూ నాలుగు ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటూ గులాబీ కార్యకర్తల్లో జోష్‌ నింపుతున్నారు. ఇవాళ తాండూరు, కొడంగల్‌, మహబూబ్‌నగర్‌, పరిగిలో జరిగే ప్రజా ఆశీర్వాద సభలకు సీఎం షెడ్యూల్ ఉంది. తాజాగా ఆయన తాండూర్‌లో ప్రసంగించారు. ఎన్నికల ప్రచారానికి ఇంకా ఆరు రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఆయన స్పీడ్ పెంచారు. అన్ని నియోజకవర్గాలను కవర్ చేసి ప్రజలను కారు పార్టీ వైపు మళ్లించాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. కాంగ్రెస్‌పై ఆయన ప్రధానంగా విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్‌కు అధికారం వస్తే జరగబోయే పరిస్థితులను వివరిస్తూ ఆయన ప్రచారం సాగుతుంది. ఇక మంగళవారం నిర్వహించిన మధిర, వైరా, డోర్నకల్, సూర్యాపేట ఆశీర్వాద సభల్లో మరోసారి కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేసిన గులాబీ బాస్..మళ్లీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే వస్తుందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story