నేడే అమర వీరుల అఖండ జ్యోతి ప్రారంభం

నేడే అమర వీరుల అఖండ జ్యోతి ప్రారంభం
హైదరాబాద్ హుస్సేన్ సాగర్‌ తీరంలో తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా నిర్మించిన అమర వీరుల అఖండ జ్యోతిని నేడు సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు

హైదరాబాద్ హుస్సేన్ సాగర్‌ తీరంలో తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా నిర్మించిన అమర వీరుల అఖండ జ్యోతిని నేడు సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు ఈ అపూర్వ ఘట్టం ఆవిష్కృతం కానుంది. అమరవీరుల స్తూపాన్ని సుమారు 177 కోట్లు వెచ్చించి నిర్మించారు. రాష్ట్ర సాధన కోసం అమరులు చేసిన త్యాగాలు తరతరాలకు స్ఫూర్తినిచ్చేలా అమరవీరుల స్మారక నిర్మాణం పూర్తయింది. వారి త్యాగాలే పునాదులుగా.. జ్ఞాపకాలే ఇటుకలుగా పేర్చుకుని రూపుదిద్దుకున్న ఈ కట్టడం ప్రారంభానికి సకల హంగులతో సిద్ధమైంది. 150 అడుగుల ఎత్తులో దేదీప్యమానంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఓ వైపు హుస్సేన్‌ సాగర్‌, మరో వైపు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సెక్రటేరియట్‌ మధ్య దీన్ని నిర్మించారు. కాగా, ప్రపంచంలోనే అతి పెద్దదైన అతుకులు లేని స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో తయారు చేయడం దీని ప్రత్యేకత. ఇవాళ సాయంత్రం 5 గంటలకు అంబేద్కర్‌ విగ్రహం నుంచి స్మారక చిహ్నం వరకు ఆరు వేల మంది కళాకారులు ప్రదర్శన చేయనున్నారు. అనంతరం సీఎం కేసీఆర్ అఖండ జ్యోతిని ఆవిష్కరిస్తారు.

మొదటి రెండు బేస్‌మెంట్లలో 2.14 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని పార్కింగ్‌ కోసం కేటాయించారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో పుస్తక ప్రదర్శన, ఇతర ఎగ్జిబిషన్ల కోసం ప్రత్యేకంగా స్థలం కేటాయించారు. మొదటి అంతస్తులో అమరుల ఫొటో గ్యాలరీతోపాటు 70 మంది కూర్చునేందుకు వీలుగా థియేటర్‌ నిర్మించారు. రెండో అంతస్తులో 500 మంది కూర్చునేందుకు వీలుగా కన్వెన్షన్‌ సెంటర్‌ ఉంది. ఇక మూడో అంతస్తులో చుట్టూ అద్దాలతో, టెర్రస్‌పైన అద్దాల పైకప్పుతో రెస్టారెంటును ఏర్పాటు చేశారు. ఇక దీపం ఆకృతిలో రూపుదిద్దుకున్న నిర్మాణానికి ఎలాంటి అతుకులు కనిపించకుండా ప్రత్యేక స్టీలును ఉపయోగించారు. స్టీలును జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నారు. దుబాయ్‌లోని గ్రాన్‌క్రాఫ్ట్‌ సంస్థ ఆ స్టీలును ఆకృతులుగా మలచి హైదరాబాద్‌కు తరలించగా క్రమబద్ధంగా అమర్చారు. పైన కన్పించే దీపం ఆకృతికే సుమారు వంద టన్నుల స్టీలును వినియోగించారు. దీపం ప్రజ్వలన ప్రాంత నిర్మాణానికి కార్బన్‌ స్టీలు వినియోగించారు. ఈ కారణంగా అది అద్దాలతో తీర్చిదిద్దినట్టుగా కనిపిస్తుంది. దీపపు కాంతి చూపరులను ఆకట్టుకునేలా కింది నుంచి ప్రత్యేక విద్యుత్తు కాంతులను ఏర్పాటుచేశారు.

పర్యాటకులు, అతిథులకు అతిథ్యమిచ్చేలా మూడో అంతస్తులో ఒకటి, టెర్రస్‌పై ఒకటి ఇలా రెండు రెస్టారెంట్లు సిద్ధంచేశారు. అందుకు అనుగుణంగా లోయర్‌ బేస్‌మెంట్‌లో కనీసం వెయ్యి మందికి భోజనాలు సిద్ధం చేసేందుకు కావాల్సిన స్థాయిలో వంటశాలకు అవసరమైన స్టౌలు, ఇతర పరికరాలు అమర్చారు. 800 లీటర్ల సామర్థ్యంతో కూడిన ఫ్రీజర్‌ను సిద్ధంచేశారు. మూడో అంతస్తులో మరో అత్యాధునిక వంటశాల ఉంది. ఈ అంతస్తులో వంటలు చేయటానికి గ్యాస్‌ స్టౌల స్థానంలో విద్యుత్తు ఆధారిత ఇండక్షన్‌ స్టౌలు ఏర్పాటుచేశారు. మూడో అంతస్తుకు అనుసంధానంగా ఏర్పాటుచేసిన రెస్టారెంటు చుట్టూ గ్లాసులు అమర్చిన కారణంగా అక్కణ్నుంచి నూతన సచివాలయం, ఇటీవల ఆవిష్కరించిన డాక్టర్‌ అంబేడ్కర్‌ విగ్రహం, హుస్సేన్‌సాగర్‌ అందాలను ఆస్వాదించొచ్చు. ఇక తెలంగాణ సాధన ఎలా చరిత్ర సృష్టించిందో ఈ ప్రత్యేక మిర్రర్‌ ఇమేజ్‌ స్టీలు నిర్మాణం కూడా చరిత్రలో నిలవనుంది. ప్రపంచవ్యాప్తంగా ఇలా నిర్మించిన ఆకృతులన్నింటికంటే అమరవీరుల స్మారకమే అతి పెద్దది.

అమరవీరుల చిహ్నం ప్రారంభోత్సవం నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. మధ్యాహ్నం 3గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నట్లు వెల్లడించారు. ఖైరతాబాద్‌ చౌరస్తా నుంచి నెక్లెస్ రోడ్డు రోటరీ, ఎన్టీఆర్ మార్గ్‌, తెలుగు తల్లి జంక్షన్ల మధ్య వాహనాలకు అనుమతి లేదు. ఆయా మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లీస్తామని పోలీసులు తెలిపారు. ఇక ఎన్టీఆర్ గార్డెన్, నెక్లెస్‌ రోడ్, లుబినీపార్క్ క్లోజ్ చేస్తామని ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story