REVANTH: ఫాంహౌజ్‌లో కూర్చుని ప్రభుత్వంపై కుట్రలు

REVANTH: ఫాంహౌజ్‌లో కూర్చుని ప్రభుత్వంపై కుట్రలు
X
బీఆర్ఎస్‌, బీజేపీపై ముఖ్యమంత్రి తీవ్ర విమర్శలు... కాంగ్రెస్‌ను ఓడించండి చూద్దామంటూ సవల్‌

మాజీ సీఎం కేసీఆర్‌ ఫాంహౌజ్‌లో కూర్చుని తమ ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్‌లోని పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేవంత్... బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ అవసరం రాష్ట్రానికి లేదని ప్రజలే తీర్పు ఇచ్చారని ఆయన అన్నారు. చేసింది చాలు.. ఇక ఫామ్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకొమ్మని కేసీఆర్‌కు ప్రజలు చెప్పారని అన్నారు. ప్రజలు తిరస్కరించినప్పటికీ కేసీఆర్‌లో మార్పు రాలేదన్న రేవంత్.. రాష్ట్రంతో పేగుబంధం తెంపుకుంటూ పార్టీ పేరు కూడా మార్చుకున్నారని తీవ్రంగా మండిపడ్డారు.

ప్రధాన ప్రతిపక్షం.. అభ్యర్థులే లేరు

ప్రధాన ప్రతిపక్షం అనే బీఆర్‌ఎస్‌కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులే లేరని రేవంత్ అన్నారు. రాజకీయ పార్టీగా చెప్పుకునే అర్హత BRSకు ఉందా? అని ప్రశ్నించారు. పోటీ చేయలేని వాళ్లకు తమ పార్టీని ప్రశ్నించే అర్హత ఉందా అని రేవంత్ నిలదీశారు. పది నెలల్లో ఏం చేశారని మమ్మల్ని అడుగుతున్నారని... మరి పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ చేసిందేంటి? ఏం చేయలేదు కాబట్టే BRSను ప్రజలు తిరస్కరించారు’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. ‘తెలంగాణ సాధనలో పట్టభద్రులదే కీలక పాత్ర. మీరు ఆలోచించి ఓటు వేయాలి. BRS తన పాలనలో ఉద్యోగాలు ఇచ్చిందా? విద్యార్థులను కోచింగ్ సెంటర్ల చుట్టూ అనాథలుగా తిప్పింది BRS కాదా? మేం అధికారంలోకి వచ్చాక 55,163 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది నిజం కాదా? 11 వేల మంది టీచర్లను నియమించింది నిజం కాదా? అదే నిజమైతే మాకు ఓటు వేయండి’.” అని రేవంత్ కోరారు.

కాంగ్రెస్‌ను ఓడించండి చూద్దాం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించండి చూద్దామంటూ BRS నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడ్డాక 55వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. పోలీసుశాఖలో 15 వేల మందికి ఉద్యోగాలిచ్చామని, 6వేలకు పైగా పారామెడికల్‌ సిబ్బందిని నియమించామన్నారు. బీజేపీకి 8 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం నుంచి వారు సాధించిందేటని ప్రశ్నించారు.

రాహుల్‌ ఆశయం మేరకే కులగణన:

రాహుల్ గాంధీ ఆశయం మేరకు రాష్ట్రంలో కులగణన సర్వే పూర్తి చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో ఎవరూ చేయని సాహసాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిందని చెప్పారు. వందేళ్లుగా జరగని కులగణనను సమర్థంగా నిర్వహించామని పేర్కొన్నారు. 26.50లక్షల మంది రైతులకు రూ.2లక్షల చొప్పున రుణమాఫీ చేశామని.. సన్న వడ్లకు రూ.500 బోనస్‌ వచ్చి ఉంటేనే పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేయాలని సీఎం వ్యాఖ్యానించారు.


Tags

Next Story