REVANTH: ఓడిపోతే ముక్కు నేలకు రాస్తా

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. పదేళ్లు అధికారంలో ఉండి కేసీఆర్ తెలంగాణకు ఏం చేశారో.. పన్నెండేళ్లుగా కేంద్రంలోని బీజేపీ, ఏడాదిలోనే తామేం చేశామో చర్చించడానికి తాను సిద్ధమని కీలక ప్రకటన చేశారు. చర్చలో తాను ఓడిపోతే అక్కడే ముక్కు నేలకు రాస్తా అన్నారు. నారాయణపేట్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
రాజశేఖర్ రెడ్డి చెప్పులు మోసింది.. కేసీఆరే
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నపుడు కేసీఆర్ ఆయన చెప్పులు మోశారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీళ్లు వెళ్లేలా చేసింది కూడా కేసీఆరే అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుని కేసీఆర్ పూర్తిచేసి ఉంటే, ఇవాళ ఏపీతో గొడవ ఉండేది కాదని చెప్పుకొచ్చారు. లక్ష కోట్లతో కాళేశ్వరం కట్టి.. బీఆర్ఎస్ నేతలు వేల కోట్లు మింగేశారన్నారు.
నా మీద పగతో పక్కకు ప్రాజెక్టు
తన మీద పగతో మక్తల్-నారాయణపేట-కొడంగల్ ప్రాజెక్టు పక్కన పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నారాయణపేటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రేవంత్ శంకుస్థాపన చేశారు. పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. వైఎస్‌ఆర్, జగన్ పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా నీళ్లు రాయలసీమకు తరలించుకుపోతుంటే BRS ప్రభుత్వం నోరెత్తలేదన్నారు.
వైద్య వృత్తి ఉద్యోగం కాదు
నారాయణ్ పేట్ జిల్లాలో మెడికల్ కాలేజి భవన నిర్మాణానికి రేవంత్ శంకుస్థాపన చేశారు. ‘మారుమూల ప్రాంతంలో మెడికల్ కాలేజీ నిర్మించుకోవడం ఆనందంగా ఉంది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. వైద్య వృత్తి అంటే ఉద్యోగం కాదు. అదొక భాధ్యత’ అని రేవంత్ తెలిపారు.
ఎమ్మెల్సీ ఎన్నికలపై రేవంత్ ప్రత్యేక దృష్టి
తెలంగాణలోని ఎమ్మెల్సీ ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. పట్టభద్రులతో ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించారు. జిల్లాల వ్యాప్తంగా నెలకు రెండు మూడు సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు సమయం సమీపిస్తుండటంతో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని రేవంత్ ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com