Telangana : గెలుపు కోసం కాంగ్రెస్ కసరత్తు

లోక్‌సభ ఎన్నికలు మంత్రులకు సవాలుగా మారాయి. పలు లోక్‌సభ నియోజకవర్గాలకు మంత్రులను ఇన్‌ఛార్జిగా నియమించిన కాంగ్రెస్ గెలుపు బాధ్యతలను అప్పగించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితరులు రాష్ట్రవ్యాప్తంగా దృష్టి సారించినా, మంత్రులకు ప్రత్యేకంగా నియోజకవర్గాల బాధ్యతలను పార్టీ అప్పగించింది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రోజూ సభలు, రోడ్‌షోల్లో పాల్గొంటున్నారు. మంత్రులు తమకు అప్పగించిన నియోజకవర్గాలపై పూర్తిగా దృష్టి సారించారు.
రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో మిషన్ 15 లక్ష్యంపై కాంగ్రెస్ దృష్టిసారించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్ని లోక్‌సభ స్థానాల్లో విజయానికి పార్టీ వ్యూహరచనను అమలు చేస్తున్నారు. ప్రత్యేకించి ఆయన మహబూబ్‌నగర్, చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ తదితర స్థానాలపై ఎక్కువగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో సమాచారం తెలుసుకొంటూ మంత్రులు, ఎమ్మెల్యేలను అప్రమత్తం చేస్తున్నారు. MP అభ్యర్థిని గెలిపించుకోవడం కొందరు మంత్రులకు పరీక్షగా మారింది.
మంత్రి సీతక్కకు ఆదిలాబాద్ లోక్‌సభ బాధ్యత అప్పగించారు. ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఒకటి మాత్రమే కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచారు. మంత్రి సీతక్క ఆదిలాబాద్‌పై పూర్తిగా దృష్టి కేంద్రీకరించారు. ఏకైక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో కలిసి సీతక్క విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మంత్రి కొండా సురేఖకు పార్టీ మెదక్ లోక్‌సభ సీటు బాధ్యతలు అప్పగించింది. ఈ నియోజకవర్గ పరిధిలోనూ మెదక్ సెగ్మెంటులో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. ఈ క్రమంలో కొండా సురేఖ విజయం కోసం శ్రమిస్తున్నారు. ఖమ్మం అభ్యర్థి విషయంలో భట్టి, పొంగులేటి మధ్య చివరి వరకు పోటీ నెలకొనగా.. పొంగులేటి సూచించిన ఆయన వియ్యంకుడు రఘురాంరెడ్డికే టికెట్ దక్కింది. ఈ నేపథ్యంలో ఖమ్మం లోక్‌సభ పరిధిలో మంత్రులంతా కలిసి చేసే ప్రచారానికి ప్రాధాన్యం ఉంది. గ్యారంటీల అమలు, అసెంబ్లీ ఫలితాల జోష్ నిలుపుకునేలా ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లు సాధిస్తారో చూడాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com