CM REVANTH: కాలేజీ విద్యార్థినులకు ఎలక్ట్రికల్ స్కూటీలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల సాధికారతపై కీలక సందేశం ఇచ్చారు. మహిళలు ఆర్థికంగా బలపడితేనే సమాజం, దేశం నిజమైన అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని ఆయన పేర్కొన్నారు. మహిళలకు విద్య, ఉపాధి, రవాణా వంటి రంగాల్లో మరింత అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. ముఖ్యంగా కాలేజీల్లో చదువుతున్న విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు అందించే అంశంపై ఆయన చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఒకటని గుర్తు చేస్తూ, ఆ హామీ అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మహిళల పాత్రపై విస్తృతంగా మాట్లాడారు. మహిళలు సమాజంలోని అన్ని రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్నారని, ప్రభుత్వం కూడా వారికి తగిన గుర్తింపు ఇవ్వాలని సంకల్పంతో ముందుకు సాగుతోందన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని కీలక ప్రభుత్వ శాఖలను మహిళా అధికారులు సమర్థంగా నడిపిస్తున్నారని ఆయన ప్రశంసించారు. ఇటీవల మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియలో కూడా మహిళా అధికారులు కీలక పాత్ర పోషించారని గుర్తుచేస్తూ వారిని అభినందించారు.
గతంలోనే హమీ
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇవ్వాలని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ హామీ అమలు గురించి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. 18 సంవత్సరాలు పూర్తయి కాలేజీలో చదువుతున్న విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇవ్వడం ద్వారా వారి ప్రయాణ సమస్యలను తగ్గించడంతో పాటు, విద్యను కొనసాగించడానికి సౌలభ్యం కల్పించాలనేది ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం అమలు కావడం కష్టమయ్యే అవకాశముందని, కానీ త్వరలోనే ఈ స్కూటీలను అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా దేశంలో మహిళలు ఎదుర్కొంటున్న వివక్షపై కూడా సీఎం మాట్లాడారు. భారతదేశంలో కేవలం కులాల మధ్య మాత్రమే కాకుండా స్త్రీ-పురుషుల మధ్య కూడా అనేక రకాల వివక్షలు కొనసాగుతున్నాయని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా కొన్ని స్థాయిలో వివక్ష ఉన్నప్పటికీ అక్కడ కష్టపడే వారికి గుర్తింపు లభిస్తుందని, ముందుకు వెళ్లాలనుకునే వారికి అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. కానీ మన దేశంలో మహిళల శ్రమకు సరైన గుర్తింపు లేకపోవడం బాధాకరమని అన్నారు. ఇంట్లో చేసే పనులు అయినా, ఉద్యోగాల్లో చేసే కృషి అయినా చాలాసార్లు చిన్నచూపు చూస్తారని చెప్పారు. ఈ పరిస్థితిని మార్చాలంటే మహిళల ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు సంస్థలపై కూడా ఉందని స్పష్టం చేశారు.
వ్యక్తిగతంగా కొందరు మాత్రమే మార్పు తీసుకురావడం సాధ్యం కాదని, కానీ వ్యవస్థగా మహిళల ప్రతిభను గుర్తించి వారికి అవకాశాలు కల్పిస్తే సమాజంలో పెద్ద మార్పు వస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. మహిళల ఆర్థిక శక్తి పెరిగినప్పుడే ఏ దేశమైనా అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపు పొందుతుందని ఆయన చెప్పారు. అందుకే మహిళల సాధికారతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మహిళలకు రవాణా రంగంలో కూడా మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించినట్లు గుర్తు చేస్తూ, త్వరలో ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం కల్పించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ నగరాలతో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో పలు చర్యలు చేపడుతున్నామని అన్నారు. నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. 2026 డిసెంబర్ నాటికి హైదరాబాద్‌లో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులే నడిచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సీఎం తెలిపారు. ఇప్పటికే 500 ఎలక్ట్రిక్ బస్సులు వచ్చాయని, త్వరలో మరో 2300 బస్సులు చేరనున్నాయని వెల్లడించారు. వచ్చే డిసెంబర్ 9 నాటికి నగరంలో ఒక్క డీజిల్ బస్సు కూడా ఉండకుండా అన్ని బస్సులను ఎలక్ట్రిక్ ఏసీ బస్సులుగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అదే విధంగా ప్రస్తుతం నడుస్తున్న పెట్రోల్, డీజిల్ ఆటోలను కూడా దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే ప్రణాళిక ఉందని చెప్పారు.
ఇక స్వయం సహాయక సంఘాల మహిళలకు కూడా ప్రభుత్వం కొత్త అవకాశాలు కల్పిస్తోందని సీఎం వివరించారు. కార్పొరేట్ సంస్థల ఉత్పత్తులు మాత్రమే ఎక్కువగా కనిపించే అమెజాన్ వంటి అంతర్జాతీయ వేదికల్లో స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను కూడా ప్రపంచ మార్కెట్‌కు చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. ఇందిరా బజార్ వంటి కార్యక్రమాల ద్వారా స్థానిక ప్రతిభను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. మహిళలు వ్యాపారాల్లో రాణించేలా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడాన్ని కొందరు చిన్నచూపు చూస్తున్నారని, కానీ అదే మహిళలను బస్సులకు యజమానులుగా చేసి వ్యాపారాల్లో ముందుకు రావడానికి ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తోందని సీఎం వ్యాఖ్యానించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ఉత్పత్తికి కూడా అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు.
ఇదే సందర్భంగా మధుపార్క్ అపార్ట్‌మెంట్ సమస్యపై కూడా సీఎం స్పందించారు. ఈ అపార్ట్‌మెంట్ ఈసా నది ఒడ్డున ఉండటం వల్ల 50 మీటర్ల బఫర్ జోన్ నిబంధనలు వర్తిస్తాయని చెప్పారు. ఎన్జీటీ, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం నది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతాల్లో నిర్మాణాలు ఉండకూడదని ఆయన వివరించారు. అయితే అక్కడ నివసిస్తున్న వారికి నష్టం జరగకుండా పక్కనే ఉన్న 7 ఎకరాల భూమిని కేటాయించి ప్రత్యామ్నాయంగా నిర్మాణం చేసుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న నిర్మాణానికి సమానమైన నిర్మాణం చేసేందుకు అవసరమైన నిధులను కూడా బ్యాంకులో డిపాజిట్ చేస్తామని హామీ ఇచ్చారు. మొత్తంగా మహిళల అభివృద్ధి, నగర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్లో ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలతో ముందుకు సాగుతోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మహిళలు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను వినియోగించుకుని సమాజంలో ఉన్నత స్థానాలను సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
