REVANTH: తెలంగాణ "నీటి వాటాలు" దక్కించుకోవాలి

REVANTH: తెలంగాణ నీటి వాటాలు దక్కించుకోవాలి
X
రాష్ట్ర ప్రయోజనాలకు వీసమెత్తు నష్టం వాటిల్లొద్దు... అధికారులు సీఎం కీలక ఆదేశాలు

కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన నీటి వాటాలను దక్కించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రయోజనాలకు వీసమెత్తు నష్టం వాటిల్లకుండా ట్రైబ్యునల్ ఎదుట సమర్థ వాదనలు వినిపించాలని నిర్దేశించారు. అందుకు అవసరమైన సాక్ష్యాధారాలు, రికార్డులు, ఉత్తర్వులు సిద్ధంగా ఉంచుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులు, న్యాయ నిపుణులకు స్పష్టం చేశారు. నదీజలాల అంశంపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష : నీటిపారుదల ప్రాజెక్టులు, నదీజలాల అంశాలపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ట్రైబ్యునల్ ముందు త్వరలోనే వాదనలు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి వాటాలు, ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులను బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ నిర్ణయించాల్సి ఉందని త్వరలోనే రాష్ట్రాలు తమ వాదనలు వినిపించాల్సి ఉందని అధికారులు... ముఖ్యమంత్రి రేవంత్‌కు వివరించారు. కృష్ణా జలాలకు సంబంధించి ట్రైబ్యునల్ తీర్పులు, డీపీఆర్​ల గురించి ఆరా తీసిన ముఖ్యమంత్రి జలశక్తి మంత్రిత్వ శాఖకు ఇచ్చిన నివేదికలన్నింటినీ వరుస క్రమంలో సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. వాటి ఆధారంగా ట్రైబ్యునల్ ఎదుట పకడ్బందీగా వాదనలు వినిపించాలని అధికారులను ఆదేశించారు. కృష్ణా జలాల్లో 70 శాతం వాటా రాష్ట్రానికి దక్కేలా పకడ్బందీగా వాదానలు వినిపించాలన్నారు. కృష్ణా పరీవాహక ప్రాంతం తెలంగాణలో 70 శాతం ఉండగా, ఏపీలో కేవలం 30 శాతం ఉందని అన్నారు. ఆ ప్రకారం 1005 టీఎంసీల కృష్ణా జలాల్లో 70 శాతం నీటివాటా తెలంగాణకు దక్కేలా వాదనలు వినిపించాలని అధికారులను ఆదేశించారు.

ఎందుకు పట్టించుకోవాలి..

బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ నీటి వాటాల పంపిణీ ఇప్పటి వరకు పూర్తి చేయనందున కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల నిర్ణయాలను ఎందుకు పట్టించుకోవాలని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ట్రైబ్యునల్ నీటి వాటాల పంపిణీ పూర్తయ్యే వరకు గోదావరి, కృష్ణా బోర్డుల జోక్యం ఉండకూడదని సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాలని అధికారులకు సూచించారు. వివిధ ప్రాజెక్టుల ద్వారా కృష్ణా జలాల్లో కోటాకు మించి ఎక్కువ నీటిని ఆంధ్రప్రదేశ్ తరలిస్తోందని సమావేశంలో చర్చ జరిగింది. నీటి ప్రవాహాన్ని శాస్త్రీయంగా లెక్కించే టెలీమెట్రీ పరికరాలకయ్యే 12 కోట్ల రూపాయలను రెండు రాష్ట్రాలు చెరో సగం చెల్లించాలని అధికారులు వివరించారు.

Tags

Next Story