TS: ఈ నెల 11 నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకం

TS: ఈ నెల 11 నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకం
ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం... ఇళ్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు 5 లక్షలు

తెలంగాణలో ఆరు గ్యారంటీల అమలులో భాగంగా మరో గ్యారంటీని అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈనెల 11 నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ పథకం అమలుకు విధి విధానాలు నిబంధనలు తయారు చేయాలని సూచించారు. ఇందిరమ్మ పథకంలో భాగంగా స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇళ్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు 5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. తొలివిడతలో నియోజకవర్గానికి... 3వేల 500 ఇళ్లు మంజూరు చేయాలని నిర్ణయించారు. ఇందిరమ్మ ఇళ్ల నమూనాలు,డిజైన్లను తయారు చేయించాలని అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి.... దశల వారీగా నిరుపేదల సొంత ఇంటి కల నెరవేరుస్తామని మరోసారి హామీ ఇచ్చారు.


అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణిలు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమశాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం..దుర్వినియోగం కాకుండా చూడాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ ఏర్పాటు చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు... సొంత భవనాల నిర్మాణంపై దృష్టిసారించాలని అధికారులకు సూచించారు.జీహెచ్ఎంసీ పరిధిలో మొబైల్ అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుపై అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రిప్రైమరీ విద్య సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని సూచించారు. స్వయం సహాయక సంఘాలతో శానిటరీ నాప్కిన్స్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. దివ్యాంగులకు విద్యతో పాటు ఉద్యోగాల్లోనూ 5శాతం రిజర్వేషన్ అమలు చేయాలని సీఎం నిర్ణయించారు. ట్రాన్స్ జెండర్లకు పథకాలన్నీ వర్తించేలా ప్రత్యేక విధానం తేనున్నట్లు చెప్పారు. వృద్ధాశ్రమాల ఏర్పాటుకు కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకోవాలన్నారు.


మరోవైపు అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం నాణ్యతను పట్టించుకోకుండా ఇప్పుడు రాజకీయాలు చేయడానికి బీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోందని తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ శ్రీధర్ బాబు ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో... గృహజ్యోతి కార్యక్రమం అమలు సహా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. మేడిగడ్డ చూడటానికి.. తాము ఆహ్వానించినప్పుడు భారాస నేతలు రాలేదని ఆయన విమర్శించారు. రీడిజైన్ వద్దని, అక్కడ ప్రాజెక్టు నిర్మాణం సహేతుకం కాదని నిపుణులు సలహా ఇచ్చినా పెడచెవిన పెట్టారని శ్రీధర్ బాబు దుయ్యబట్టారు. కుంగిపోయిన మేడిగడ్డ, బుంగలు పడిన అన్నారం బ్యారేజి చూసిన తర్వాతైనా ప్రజలకు క్షమాపణలు చెబితేచాలని మంత్రి అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story