REVANTH: బీఆర్‌ఎస్‌ను వంద మీటర్ల గొయ్యిలో పాతిపెడతాం

REVANTH: బీఆర్‌ఎస్‌ను వంద మీటర్ల గొయ్యిలో పాతిపెడతాం
రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు... ఆరు గ్యారంటీల అమలు దిశగా చర్యలు తీసుకుంటున్నామన్ సీఎం

ప్రపంచ దేశాలతో పోటీపడుతూ... తెలంగాణను అభివృద్ధిలో అగ్రగ్రామిగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే ఆరు గ్యారెంటీల అమలు దిశగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటుచేసి పాలన అందిస్తుంటే బీఆర్‌ఎస్‌ నేతలు ఓర్వలేక పోతున్నారని మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ను వంద మీటర్ల గొయ్యి తీసి పాతిపెడుతామని తీవ్రస్థాయిలో స్పందించారు.


లండన్‌ పర్యటనలో ప్రవాస భారతీయుల సమావేశానికి హాజరైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. తెలంగాణ అభివృద్ధిని ప్రణాళికలు వివరించారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటుచేశామని తెలిపారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో మేటిగా తీర్చిదిద్దే లక్ష్యంతో అధికారంలోకి వచ్చామని అదే దిశగా పనిచేస్తున్నామని తెలిపారు. తమకు అభివృద్ధిలో పొరుగు రాష్ట్రాలతో పోటీకాదని... ప్రపంచ దేశాలతోనే పోటీ పడతామని స్పష్టం చేశారు. లండన్‌లో థేమ్స్‌ నదిలాగా మూసీని సమూలంగా ప్రక్షాళన చేస్తామని రేవంత్‌ స్పష్టం చేశారు. మూసీ-2024ప్రాజెక్టు పేరుతో... 36నెలల్లో స్వచ్ఛమైన జలధారగా మార్చి నదీ తీరాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. బీఆర్‌ఎస్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పదేళ్ల పాటు పరిపాలించిన కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని మండిపడ్డారు. అధికారం కోల్పోయినా... బీఆర్‌ఎస్‌ నేతలకు ఇంకా అహంకారం తగ్గలేదని... వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీని చిత్తుగా ఓడిస్తామని అన్నారు.


స్పందించిన కేటీఆర్‌

వంద మీటర్ల లోపల తమ పార్టీని బొంద పెట్టే సంగతి తర్వాత చూద్దాం కానీ..... వంద రోజుల్లో నెరవెరుస్తామన్న హామీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సూచించారు.హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశంలో మాట్లాడిన KTR.... రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఏక్ నాథ్ షిండేగా మారతారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, భాజపాలు కలిసిపోతాయని తెలిపారు. గతంలో అదానీపై అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.......... ఈ రోజు అలయ్ బలయ్ చేసుకున్నారని గుర్తుచేశారు. అదానీ, రేవంత్ రెడ్డి ఒప్పందాల గుట్టు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అటు జనవరి నెల కరెంటు బిల్లులు ఎవరూ కట్టవద్దని ప్రజలకు పిలుపునిచ్చిన KTR కరెంటు బిల్లులు అడిగితే అధికారులకు సోనియాగాంధీ బిల్లు కడుతారన్న రేవంత్ రెడ్డి మాటలను వినిపించాలని సూచించారు. గృహజ్యోతి కార్యక్రమాన్ని వెంటనే అమలు చేసి కిరాయి ఇళ్లలో ఉండే వాళ్ళకి కూడా ఉచిత విద్యుత్తు ఇవ్వాలని కోరారు. ప్రతి ఒక్క మహిళకు 2 వేల 500 రూపాయలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను తప్పించుకునేందుకు కాంగ్రెస్ నేతలు చూస్తే వదిలిపెట్టే పరిస్థితి లేదని కేటీఆర్ హెచ్చరించారు. అటు విదేశాలకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.... తెలంగాణ ప్రతిష్ఠను దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story