REVANTH: 64 లక్షల రైతులకు పెట్టుబడి సొమ్ము జమ చేశాం

REVANTH: 64 లక్షల రైతులకు పెట్టుబడి సొమ్ము జమ చేశాం
మిగిలిన వారికి 8వ తేదీ లోపు ఖాతాల్లో జమ...రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్న రేవంత్‌రెడ్డి

తెలంగాణలో 64 లక్షల మందికి రైతు పెట్టుబడి సొమ్ము జమ చేశామని..మిగిలిన 4 లక్షల మందికి ఈనెల 8వ తేదీ లోపు ఖాతాల్లో వేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తమపై పెట్టిన 7 లక్షల కోట్ల అప్పుల కుంపటిని నెత్తిన మోస్తున్నప్పటికీ.. రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకప్రయత్నిస్తున్నామన్నారు. కొత్తగూడెం, దేవరకద్ర నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేసిన సీఎం... బీజేపీ, బీఆర్‌ఎస్‌ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. మే 8 వరకు రైతు భరోసా సొమ్ము జమ కాకపోతే అమర వీరుల స్థూపం వద్ద బహిరంగ చర్చకు సిద్ధంగా ఉంటామని సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. రైతులందరికీ రైతు భరోసా అందించి రూ. 7500 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తే..క్షమాపణ చెప్పి ముక్కునేలకు రాసేందుకు కేసీఆర్ సిద్ధమా అని ప్రశ్నించారు. రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగం మార్పును ప్రజలకు చెప్పినందుకు తనపై అక్రమ కేసులు పెడుతున్నారని కొత్తగూడెం జనజాతర సభలో ఆక్షేపించారు. పాలమూరు బిడ్డ అత్యున్నతమైన సీఎం పదవి చేపడితే కూల్చేందుకు కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.తన ఆఖరి శ్వాస వరకు పాలమూరు అభివృద్ధికి పునరంకితమై పనిచేస్తానని స్పష్టం చేశారు..

అంతర్గత ఒప్పందంతో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలవకుండా బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసి కుట్ర చేస్తున్నాయని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్ వర్సెస్ తెలంగాణ టీమ్‌ మధ్య పోరు జరుగుతుందని..ఫైనల్స్‌లో మోదీ గుజరాత్ టీం ను ఓడించి ఛాంపియన్ షిప్ గెలవాలన్నారు. 400 సీట్లు ఇస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ వ్యాఖ్యానించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుశ్యంత్ కుమార్ గౌతమ్ వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ నేతలు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి మరో వారం రోజులే సమయం ఉన్నందున ముఖ్యమంత్రి పర్యటన కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపుతోంది.

హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీలో 2016 ఏడాది ఆత్మహత్య చేసుకున్న.. రోహిత్‌ వేముల ఆత్మహత్య కేసుపై పునర్విచారణ చేపట్టి..... న్యాయం జరిగేలా చూస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. రోహిత్‌ ఆత్మహత్య వ్యవహారంలో.... వర్సిటీ వీసీ, పలువురు నేతలపై దాఖలైన కేసులో ఆధారాల్లేవంటూ కోర్టు విచారణను ముగించిన వేళ రోహిత్‌ తల్లి సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన రేవంత్‌రెడ్డి.... పునర్విచారణపై ఇప్పటికే డీజీపీ ప్రకటన చేసిన అంశాన్ని గుర్తుచేశారు. తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.

Tags

Next Story