TS: హైద్రాబాద్‌లో నాలుగో పారిశ్రామిక విప్లవ కేంద్రం

TS: హైద్రాబాద్‌లో నాలుగో పారిశ్రామిక విప్లవ కేంద్రం
సీ 4 ఐ ఆర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి.... పంచ ఆర్థిక ఫోరం ప్రెసిడెంట్ బోర్డే బ్రెండేతో కలిసి సంయుక్త ప్రకటన

హైదరాబాద్ లో నాలుగో పారిశ్రామిక విప్లవ కేంద్రం- C-4-I-R ఏర్పాటు చేయనున్నామని సీఎం రేవంత్ రెడ్డి, ప్రపంచ ఆర్థిక ఫోరం ప్రెసిడెంట్ బోర్డే బ్రెండే సంయుక్త ప్రకటన చేశారు. ఈ మేరకు డబ్ల్యూఈఎఫ్ అధ్యక్షుడితో సమావేశమైన రేవంత్ రెడ్డి.. ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభంకానున్న బయోఏషియా సదస్సులో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. అటు దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణలో పెట్టుబడి పెట్టండి పేరుతో ప్రభుత్వం పెవిలియన్ ఏర్పాటు చేసింది. సృజనాత్మక సంప్రదాయాల కలయిక - వేర్ ట్రెడిషన్ మీట్స్ ఇన్నోవేషన్ అనే ట్యాగ్ లైన్ తో.. తెలంగాణ సంసృతి, సాంకేతిక సృజనాత్మకతలు ప్రతిబింబించేలా బతుకమ్మ, బోనాలు, చార్మినార్, చేర్యాల పెయింటింగ్, పోచంపల్లి ఇక్కత్, టీహబ్, స్కైరూట్ ఏరోస్పేస్ తో... వాల్ డిజైనింగ్ చేశారు.


పెట్టుబడులకు దేశంలోనే మొదటి గమ్యస్థానం ప్రపంచంలోనే అపార అవకాశాలున్న ప్రాంతం తెలంగాణ వంటి నినాదాలతో పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తున్నారు. ఈ పెవిలియన్ లో సీఎం రేవంత్ రెడ్డి బృందం మెడ్ ట్రానిక్స్ సీఈవో, అపోలో హాస్పిటల్స్ ప్రతినిధి ప్రీతారెడ్డి, యూఎన్ ఎఫ్ పీఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నటాలియా కనేం, దావోస్ అల్జీమర్స్ ఛైర్మన్ జార్జ్ రాడెన్ బర్గ్, తదితరులతో సమావేశమైంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ - వెఫ్ దృక్పథం, లక్ష్యాలు రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక ఫోరం, తెలంగాణ ప్రభుత్వం మధ్య అద్భుతమైన సమన్వయం కుదిరిందన్నారు. నాణ్యత ప్రమాణాలు మెరుగుపరచడం ద్వారా ప్రజల జీవితాలు బాగుచేయాలన్న ఆలోచనలతో...ఎకనామిక్‌ ఫోరం ప్రపంచ స్థాయిలో పని చేస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని 4 కోట్ల మందిపై దృష్టి కేంద్రీకరిస్తోందన్నారు.


వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం భాగస్వామ్యంతో ప్రజారోగ్యంతో సాంకేతికత, జీవన ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యాలను వేగంగా అందుకోవచ్చుని ముఖ్యమంత్రి అన్నారు. చిన్న పట్టణాలు, గ్రామాలకు సాంకేతికతతో కూడిన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం పేర్కొన్నారు. హెల్త్ టెక్ రంగంలో తెలంగాణను ప్రపంచ గమ్యస్థానంగా మార్చటంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. హెల్త్ టెక్, లైఫ్ సైన్సెస్ రంగానికి నాయకత్వం వహించేందుకు..తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్.. సెంటర్ ఫర్ హెల్త్ అండ్ హెల్త్‌కేర్ అధిపతి డాక్టర్ శ్యామ్ బిషెన్ పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఏర్పాటు కానున్న సీ ఫోర్ ఐఆర్ అందరికీ అందుబాటులో ఉండేలా సాంకేతిక విధానాలతో కూడిన ఆరోగ్య సంరక్షణ సేవలు అందించడంలో చొరవ చూపుతుందనే నమ్మకముందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story