REVANTH: కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు బీఆర్‌ఎస్-బీజేపీ కుట్ర

సార్వత్రిక ఎన్నికల వేళ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలమూరు జిల్లాలో ఐదోసారి పర్యటించారు. మహబూబ్‌నగర్ లోక్‌స్థానం పరిధిలోని నారాయణపేట జిల్లా మద్దూరులో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు బీఆర్‌ఎస్, బీజేపీ కుట్రలు పన్నుతున్నాయని ఆయన ఆరోపించారు. పదేళ్ల కేసీఆర్ హయాంలో తెలంగాణ నాశనమైందన్నారు. రుణమాఫీపై బీఆర్‌ఎస్ నేతల విమర్శలపై రేవంత్ ఎదురుదాడికి దిగారు. తర్వాత కొత్తపల్లి మండలంలోని తిమ్మరెడ్డిపల్లిలో బావాజీ ఆలయానికి వెళ్లిన సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లిలో కాంగ్రెస్ జన జాతర సభకు హాజరయ్యారు. డీకే అరుణ, ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్‌లతో తనకు ఎలాంటి వివాదం లేదన్నారు. 70 ఏళ్ల తర్వాత..పాలమూరు జిల్లాకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని అభివృద్ధి చేసుకుందామని అందుకు రెండు ఎంపీలను గెలపించాలని రేవంత్ ప్రజలకు పిలుపునిచ్చారు.
ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఐదింటిని 100 రోజుల్లోనే అమలు చేశామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నా.. కేసీఆర్ మాత్రం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. ఆయన చేసిన రైతు రుణమాఫీ బ్యాంకుల వడ్డీకే సరిపోలేదని విమర్శించారు. నారాయణపేట జిల్లా మద్దూరులో పార్టీ కార్యకర్తలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొడంగల్ బిడ్డకు కాంగ్రెస్ సీఎం, పీసీసీ పదవిని ఇచ్చిందన్నారు. ‘‘కేసీఆర్ చేసిన అప్పులకు మేం రూ.24వేల కోట్లు వడ్డీ కట్టా్ం. రూ.2లక్షల రుణమాఫీ చేస్తానని నేను హామీ ఇచ్చా. ఆగస్టు 15లోపు రైతులకు రుణమాఫీ చేస్తా. నేను రుణమాఫీ చేసిన వెంటనే కేసీఆర్ భారాసను రద్దు చేస్తారా?ఏ రైతూ అధైర్య పడాల్సిన అవసరం లేదు. రైతులను బ్యాంకులు ఇబ్బంది పెట్టొద్దు. రుణమాఫీ చేసే బాధ్యత నాది. కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలి. భాజపా నేతలు దేవుడిని రోడ్లపైకి తెస్తున్నారు. దేవుడు గుడిలో ఉండాలి. భక్తి గుండెల్లో ఉండాలి. మోదీ ఏ హామీని నెరవేర్చలేదు’’ అని రేవంత్‌రెడ్డి విమర్శించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com