REVANTH: రైతులకు నష్టం కలిగితే ఉపేక్షించను

REVANTH: రైతులకు నష్టం కలిగితే ఉపేక్షించను
ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు.... ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని వ్యాఖ్య

ధాన్యం కొనుగోళ్లలో రైతులకు నష్టం కలిగించే వ్యాపారులను ఉపేక్షించేదిలేదని CM రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలిపారు. జనగామ వ్యవసాయ మార్కెట్ లో అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై తక్కువ ధరలు నిర్ణయించారన్న పత్రిక కథనాలపై సీఎం రేవంత్ రెడ్డి సామాజిక మాధ్యం ఎక్స్ లో స్పందించారు. మార్కెట్ కమిటీ అధికారులు, వ్యాపారులతో కుమ్మక్కై రైతుల కష్టాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. జనగామ వ్యవసాయ మార్కెట్ లో రైతులను మోసం చేసేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యాపారులపై కేసులు పెట్టాలని, మార్కెట్ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని ఆదేశించిన అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ ను అభినందించారు. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రవ్యాప్తంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం కోరారు.

‘‘ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. రైతుల కష్టాన్ని ఎవరైనా మార్కెట్ కమిటీ అధికారులు… వ్యాపారులతో కుమ్మక్కై తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదు. జనగామ వ్యవసాయ మార్కెట్‌లో జరిగిన ఘటనపై సకాలంలో స్పందించి.. రైతులను మోసం చేయడానికి ప్రయత్నించిన నలుగురు ట్రేడర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించడం.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన మార్కెట్ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని ఆదేశించిన అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ గారికి నా అభినందనలు’’ అంటూ సీఎం ప్రశంసించారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులందరూ ధాన్యం కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను’’ అని రేవంత్‌ పేర్కొన్నారు.

మరోవైపు తెలంగాణలో యాసంగి ధాన్యం సేకరణ చురుగ్గా సాగుతోంది. ఈ ఏడాది యాసంగి వరిపంట కొనుగోళ్ల ప్రక్రియ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైంది. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆదేశాలతో ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లు ముందుగానే ప్రారంభమయ్యాయి. ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో కొనుగోళ్లు వేగవంతమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకూ 4వేల 345 మంది రైతుల నుంచి 31వేల 215 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఈ ఏడాది మొత్తంలో దాదాపు 75.40 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోళ్లు జరుగుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 7 వేల 149 కొనుగోలు కేంద్రాలు తెరవాలని ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు.. ఇప్పటివరకు 5 వేల 422 కేంద్రాలను ప్రారంభించారు. 3 రోజుల్లోగా మిగతావాటిని తెరవనున్నట్లు తెలిపారు. వేసవి తీవ్రత దృష్ట్యా రైతులకు ఇబ్బందులు రాకుండా వడ్లు కొనుగోలు చేయాలని పౌరసరఫరాల అధికారులు యోచిస్తున్నారు.

Tags

Next Story