REVANTH: తక్కువ ధరకు ధాన్యం కొనుగులు చేస్తే ఉపేక్షించం

REVANTH: తక్కువ ధరకు ధాన్యం కొనుగులు చేస్తే ఉపేక్షించం
సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరిక... బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశం

రైతుల నుంచి తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని సీఎం రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైతులను మోసం చేసే మిల్లర్లపై కఠినంగా వ్యవహరించి ట్రేడ్‌లైసెన్స్‌ రద్దు చేస్తామని స్పష్టం చేశారు. కస్టమ్‌ మిల్లింగ్ నిలిపివేసి జైలులో పెడతామని హెచ్చరించిన సీఎం రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రాలకు తేవాలని సూచించారు. కరవు కారణంగా తాగునీటి ఎద్దడి నెలకొనకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు.


ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల చేతివాటంతో రైతులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమిచింది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి అవసరాలు, సరఫరాలపై అధికారులతో సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్షించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకునేది లేదని సీఎం హెచ్చరించారు. రైతుల నుంచి ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. రైతులను మోసం చేసే మిల్లర్లపై కఠినంగా వ్యవహరించాలని వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్లు, ట్రేడర్ల ట్రేడ్ లైసెన్స్లు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే...కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి బ్లాక్‌లిస్టులో పెట్టాలని అధికారులకు సీఎం స్పష్టంచేశారు.

కొన్నిచోట్ల తేమ ఎక్కువగా ఉందని వ్యాపారులు మిల్లర్లు ధరలో కోత పెడుతున్నారని తమ దృష్టికి వచ్చిందన్న సీఎం ధాన్యాన్ని మార్కెట్లకు తెచ్చే ముందు ఆరబెట్టాలని కర్షకులకు విజ్ఞప్తిచేశారు. కర్షకులు ధాన్యం ఆరబెట్టేందుకు మార్కెట్ యార్డుల్లోనే తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వడ్ల దొంగతనం జరుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మార్కెట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్లు పరిశీలించాలని.... రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కనీస మద్దతు ధర అమలయ్యేలా చూడాలని, రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడే పరిష్కరించాలని సూచించారు.

తెలంగాణలోని పట్టణాలు, గ్రామాల్లో తాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. పెరుగుతున్నఎండల దృష్ట్యా రానున్న రెండునెలలు మరింత కీలకమన్న ఆయన........ గతేడాదితో పోలిస్తే అధికంగా నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ ప్రజల అవసరాలకు సరిపోవటం లేదని గుర్తు చేశారు. తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా ఫిర్యాదు వచ్చినా వెంటనే అక్కడ తాగునీటి సరఫరాను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని..... ఏ రోజుకారోజు తాగునీటి సరఫరాపై సమీక్ష చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story