TS: కొత్త పారిశ్రామిక కారిడర్లు ఆమోదించండి

TS: కొత్త పారిశ్రామిక కారిడర్లు ఆమోదించండి
కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌కు రేవంత్‌రెడ్డి చర్చలు... ఐఐహెట్‌టీ మంజూరు చేయాలని వినతి

తెలంగాణలో ఏర్పాటు చేయతలపెట్టిన . నూత‌న పారిశ్రామిక కారిడార్ల ప్రతిపాద‌నకు ఆమోదం తెలపాలని.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క కేంద్రాన్ని కోరారు. తెలంగాణకు.. నేష‌న‌ల్ డిజైన్ సెంట‌ర్, మెగా లెద‌ర్ పార్క్‌, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హాండ్లూమ్‌ టెక్నాలజీ-IIHTని మంజూరు చేయాలనివిజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఇరువురు నేతలు కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులపై కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌తో చర్చించారు. వెంటనే నిధులు విడుదల చేయాలని కోరారు.


ఢిల్లీ పర్యటనలో ఉన్నముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కాంగ్రెస్‌ అధిష్ఠానం పెద్దలు సహా కేంద్రమంత్రి పీయూష్‌గోయ‌ల్‌తో స‌మావేశ‌మ‌య్యారు. తెలంగాణ‌ పౌరసరఫరాల శాఖకు కేంద్రం నుంచి 4 వేల 256 కోట్లు రావాల్సి ఉందని వెంటనే విడుదల చేయాలని గోయల్‌లో సమావేశంలో కోరారు.హైద‌రాబాద్‌ నుంచి వ‌యా మిర్యాల‌గూడ-విజ‌య‌వాడ నూతన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెల‌పాల‌ని విజ్ఞప్తి చేశారు. హైద‌రాబాద్‌-నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్‌కు తుది అనుమ‌తులు మంజూరు చేయాలని కోరారు. హైద‌రాబాద్‌-వ‌రంగ‌ల్ పారిశ్రామిక కారిడార్‌లో ఫార్మా సిటీని గ‌త ప్రభుత్వం ప్రతిపాదించింద‌ని, దానిని ఉపసంహ‌రించుకొని నూత‌న ప్రతిపాద‌న‌లు పంపేందుకు అనుమ‌తించాల‌ని విజ్ఞప్తి చేశారు.


హైద‌రాబాద్‌కు నేష‌న‌ల్ డిజైన్ సెంట‌ర్ మంజూరు చేయాల‌ని కోరారు. క‌రీంన‌గ‌ర్‌, జ‌న‌గాం జిల్లాల్లో లెద‌ర్ పార్క్ మంజూరు చేస్తే వెంట‌నే భూమి కేటాయిస్తామ‌ని... కేంద్రమంత్రికి తెలిపారు. వ‌రంగ‌ల్‌లోని మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు బ్రౌన్‌ఫీల్డ్‌హోదా ఇచ్చింద‌ని..... దానికి గ్రీన్‌ఫీల్డ్ హోదా ఇవ్వాల‌ని కేంద్రమంత్రిని రేవంత్‌రెడ్డి కోరారు. టెక్నిక‌ల్ టెక్స్‌టైల్స్ టెస్టింగ్ సెంట‌ర్ల ఏర్పాటుకు సుముఖంగా ఉన్నట్టు ఇటీవ‌ల కేంద్రం ప్రకటించింద‌ని ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేసినందున తెలంగాణకు టెస్టింగ్‌ సెంట‌ర్ మంజూరు చేయాల‌ని కోరారు. తెలంగాణకు జాతీయ చేనేత సాంకేతిక కేంద్రం-IIHT మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణలో ఏడు చేనేత క్లస్టర్స్ ఉన్నాయని, I.I.H.T మంజూరు చేస్తే నేత కార్మికులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని ఆదాయాలు పెంచుకునేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. I.I.H.T ఎక్స్‌టెన్షన్ సెంట‌ర్ ఏర్పాటుకు కేంద్రమంత్రి సానుకూల‌త వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వ ప‌థ‌కాల నుంచి తెలంగాణ‌కు రావాల్సిన నిధులు విడుద‌ల చేయాల‌ని, రాష్ట్ర అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కేంద్రమంత్రిని ఇరువురు నేతలు కోరారు. అనంతరం మణిపుర్‌ వెళ్లిన సీఎం... నేడు రాహుల్‌గాంధీ చేపట్టే భారత్ న్యాయ్ యాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీకి చేరుకుని అక్కడి నుంచే దావోస్ వెళ్లనున్నారు. ఈ నెల 21 వరకు దావోస్‌లో పర్యటించనున్నారు

Tags

Read MoreRead Less
Next Story