TELANGANA: వన్ స్టేట్.. వన్ డిజిటల్ కార్డు

తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కుటుంబ డిజిటల్ కార్డుల జారీకి కార్యాచరణ చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. డిజిటల్ కార్డులపై మంత్రులు దామోదర రాజనర్సింహ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. కుటుంబ డిజిటల్ కార్డుల జారీ కోసం ప్రతి నియోజకవర్గంలోని ఒక పట్టణం, ఓ గ్రామంలో పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు.
ప్రతీ కుటుంబానికి ఒక ‘ఫ్యామిలీ డిజిటల్ కార్డు’ ఉండాలనే విధానంపై రేవంత్ ప్రభుత్వం యోచిస్తోంది. రేషను కార్డుగా, వైద్యారోగ్య కార్డుగా, హెల్త్ ప్రొఫైల్ కార్డుగా, సంక్షేమ పథకాలకు అర్హత ఉండేలా ఒకే కార్డు అమల్లోకి తేవాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. అదే ఫ్యామిలీ డిజిటల్ కార్డు వ్యవస్థను అమలులోకి తేవాలని భావించింది. ఇకపైన ప్రభుత్వపరంగా ఏ వెల్ఫేర్ స్కీమ్ ద్వారా లబ్ధి పొందాలన్నా ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఉండడం తప్పనిసరి షరతుగా పెట్టనున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింతో పాటు పౌరసరఫరాల, వైద్యారోగ్య శాఖల అధికారులతో ఈ అంశాన్ని వెల్లడించారు. ఈ కార్డులను జారీ చేయడానికి ముందే కుటుంబ సభ్యుల వివరాలన్నింటినీ సమగ్రంగా నమోదు చేయాలని సూచించారు. ప్రతీ కుటుంబానికి ఈ కార్డుల్ని ఇవ్వాలనుకుంటున్నందున ప్రయోగాత్మకంగా ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఒక గ్రామాన్ని, మరో పట్టణాన్ని ఎంపిక చేసి కార్యాచరణను మొదలుపెట్టాలని సూచించారు.
సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైనవారందరికీ అందించాలని ప్రభుత్వం భావిస్తున్నందున అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ విధానాన్ని అవలంబించడంపై ఈ సమావేశంలో సీఎం చర్చించారు. ఒకే కార్డు ద్వారా ప్రభుత్వం తరఫున రేషను, వైద్యారోగ్య చికిత్స, సంక్షేమ పథకాల ఫలాలను అందించాలని నిర్ణయించింది. ఈ కార్డు ద్వారానే లబ్ధిదారులు ఎక్కడినుంచైనా రేషను వస్తువులను తీసుకోవచ్చని, ఏ ఆస్పత్రిలోనైనా చికిత్స పొందవచ్చని, ఆ దిశగా ఉపయోగపడేలా ఈ కార్డులు ఉండాలని స్పష్టం చేశారు. వైద్యారోగ్య అవసరాలకు చికిత్స పొందే సమయానికి సదరు వ్యక్తికి సంబంధించి హెల్త్ ప్రొఫైల్ మొత్తం ఈ డిజిటల్ కార్డు ద్వారా డాక్టర్లు తెలుసుకునే వెసులుబాటు కూడా ఉండాలన్నారు. దీర్ఘకాలంలో వైద్య సేవలకు ఈ కార్డు కీలకంగా ఉంటుందన్నారు. కుటుంబాల్లో సభ్యులు మారుతూ ఉంటారని, పుట్టే పిల్లలతో కొత్తగా పేర్లు నమోదవుతుంటాయని, పెళ్ళి చేసుకున్న తర్వాత ఆ కుటుంబం నుంచి వేరుగా వెళ్ళి మరో కుటుంబంగా తయారవుతుందని, ఇలాంటి వివరాలన్నీ ఆ ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ఎప్పటికప్పుడు అప్‌డేట్ కావాలని రేవంత్ రెడ్డి సూచించారు.
రాజస్థాన్, హర్యానా, కర్ణాటక రాష్ట్రాల్లో ఇప్పటికే ఇలాంటి వ్యవస్థ పనిచేస్తున్నందున అక్కడికి వెళ్ళి నిశితంగా అధ్యయనం చేయాలని అధికారులకు మంత్రులు సూచించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల వ్యవస్థ పర్యవేక్షణకు జిల్లాలవారీగా ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com