TG: తెలంగాణలో స్థిరాస్తి మార్కెట్ ధరలు మరోసారి పెంపు

తెలంగాణలో స్థిరాస్తి మార్కెట్ ధరలు మరోసారి పెంచేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత ఈ ప్రక్రియ మొదలు కానున్నట్లు సమాచారం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక రెండు సార్లు మార్కెట్ ధరలను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. దీంతో మరోసారి పెంచాలనే నిర్ణయంతో ప్రస్తుత ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి కనీసం రెండు నెలలు సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మార్కెట్ విలువల పెంపుతో 15వందల కోట్ల నుంచి 2వేల కోట్ల వరకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు.
తెలంగాణలో భూముల మార్కెట్ విలువ సవరించడంపై సర్కార్ దృష్టిసారించింది. 2013లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో రిజిస్ట్రేషన్ ధరలు పెరిగాయి. ఆ తరువాత ఏడేళ్ల పాటు ఎలాంటి పెంపు జరగలేదు. దీంతో బహిరంగ మార్కెట్ విలువలకు, మార్కెట్ ధరలకు భారీగా వ్యత్యాసం ఏర్పడింది. 2021 ఆగస్టులో 15 నుంచి 20శాతం వరకు మార్కెట్ రిజిస్ట్రేషన్ విలువలను పెంచిన అప్పటి భారాస ప్రభుత్వం ఆరు నెలల్లోనే మరోసారి పెంచింది. ధరలు పెంచి రెండేళ్లు దాటినందున రిజిస్ట్రేషన్ ధరలకు, బహిరంగ మార్కెట్ ధరలకు వ్యత్యాసం అధికంగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనిని మరొకసారి పెంచేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని 143 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిధిలో సబ్ రిజిస్ట్రార్ కన్వీనర్‌గా, అదనపు కలెక్టర్ ఛైర్మన్‌గా, ఎమ్మార్వో, స్థానిక సంస్థల ప్రతినిధిగా ఐదుగురితో మార్కెట్ దరల పెంపు కమిటీని ఏర్పాటు చేయనుంది.
అంతకు ముందే రాష్ట్ర స్థాయిలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు సమావేశమై.... క్షేత్రస్థాయిలో మార్కెట్ ధరల పెంపునకు ఏయే అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలన్నమార్గదర్శకాలను సిద్దం చేసి కమిటీలకు అందచేస్తారు. ఈ మార్గదర్శకాలతో పాటు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిధిలో జరిగిన రిజిస్ట్రేషన్లను కమిటీ పరిశీలిస్తుంది. అదేవిధంగా బహిరంగ మార్కెట్లో స్థిరాస్తి ధరలనూ తెప్పించుకుంటుంది. వీటిన్నింటిపై ఆయా కమిటీలు చర్చిస్తాయి. విమర్శలకు తావులేకుండా ఏయే ప్రాంతాల్లో ఎక్కువ వ్యత్యాసం ఉంది... అక్కడ హేతుబద్దంగా ఎంత శాతం పెంచేందుకు అవకాశం ఉంది... తదితర అంశాలపై లోతైన చర్చ చేస్తాయి. ఆయా కమిటీలు తమ నివేదికలను... స్ట్రాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు అందిస్తాయి. ఆ తరువాత రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులు సమావేశమై కమిటీల నుంచి అందిన నివేదికలను మరింత లోతుగా అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటారు.
గడిచిన రెండున్నర సంవత్సరాలకు...ఇప్పటికి ధరలను పరిశీలించినట్లయితే బహిరంగ మార్కెట్ ధరలకు, మార్కెట్ ధరలకు వ్యత్యాసం భారీగానే ఉంటుంది. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌మల్కాజిగిరి, మెదక్, నల్గొండలలో కొంత భాగంలో కమర్షియల్ రహదారులను గుర్తిస్తారు. అక్కడ తాజాగా ఉన్న మార్కెట్ ధరలను, ఓపెన్ మార్కెట్ ధరలతో బేరీజు వేసి ఎంత మేర పెంచొచ్చన్న దానిపై నిర్ణయం తీసుకుంటారు. కనీసం 15శాతం నుంచి 20శాతం మార్కెట్ విలువలు పెరిగే అవకాశం ఉందని.... తద్వారా రెండు వేల కోట్ల వరకు ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com