REVANTH: మేడిగడ్డపై పూర్తి వివరాలు ఇవ్వండి

REVANTH: మేడిగడ్డపై పూర్తి వివరాలు ఇవ్వండి
X
నీటిపారుదల శాఖ అధికారులకు రేవంత్‌రెడ్డి ఆదేశం.... జ్యుడిషియల్‌ విచారణకు ప్రభుత్వం సిద్ధం!

కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో కుంగిన మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన పూర్తి వివరాలివ్వాలని నీటిపారుదల శాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. బ్యారేజీ కుంగడంపై వాస్తవాలను తేల్చేందుకు జ్యూడిషియల్‌ విచారణ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. 21న శాసనసభ సమావేశాల అనంతరం ఈ మేరకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు సమాచారం. యాసంగి పంటలకు నీళ్లిచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి తన నివాసంలో ఇంజినీర్లతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో ప్రస్తుతం నీటిపారుదల రంగం పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని నీటిపారుదల శాఖ అధికారులను సీఎం ఆదేశించారు.


బ్యారేజీకి సంబంధించి నిర్మాణ సంస్థ నీటిపారుదలశాఖకు రాసిన లేఖపై న్యాయపరంగా తీసుకోనున్న చర్యలను ఇంజినీర్లు ముఖ్యమంత్రికి వివరించారు. శాఖ నుంచి నిర్మాణ సంస్థకు జారీ చేసిన లేఖకు సంబంధించిన అంశాలు చర్చకు వచ్చాయి? ఆ సంస్థతో ఒప్పందం ఎలా జరిగింది? బ్యారేజీని పునరుద్ధరించేందుకు చేపట్టాల్సిన చర్యలేమిటి? ముందుకెళ్లడానికి ఉన్న వనరులు ఏమిటనే అంశాలపై సీఎం ప్రశ్నించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై వాస్తవాలను తేల్చేందుకు జ్యుడిషియల్‌ విచారణ చేయించాలని నిర్ణయించినట్లు తెలిసింది. 21న శాసనసభ సమావేశాల అనంతరం ఈ మేరకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు సమాచారం.

తెలంగాణలో యాసంగి పంటలకు సాగునీరిచ్చేందుకు ప్రాజెక్టుల్లో ఉన్న నీటి లభ్యతపై సీఎం సవివరంగా చర్చించారు. గోదావరి పరీవాహకంలో నీటి విడుదలకు ఇబ్బందులేమీ లేవని, కృష్ణా ప్రాజెక్టుల కింద సమస్య ఉందని ఇంజినీర్లు వివరించారు. వానాకాలం పంటలకు నీటి విడుదల సందర్భంగా యాసంగి పరిస్థితులను రైతులకు ముందుగా ఎందుకు వివరించలేదని సీఎం ప్రశ్నించారు. రాష్ట్రంలో అప్పుల కారణంగా విద్యుత్‌ సరఫరాకు సమస్యలు, ప్రాజెక్టుల్లో నీటి లభ్యత లేని కారణంగా సాగుకు ఇబ్బందులు, రాష్ట్ర వ్యయాలకు సంబంధించి అప్పుల కారణంగా నిధుల వెసులుబాటుకు సమస్యలు ఉన్నాయని ప్రజలకు అధికారులు ఎందుకు ముందుగా వివరించలేదని సీఎం పేర్కొన్నారు. పంటలకు సాగునీటిని విడుదల చేయలేమని రైతులకు ముందుగా ఎందుకు చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా పరీవాహకంలో తాగునీటి అవసరాలకు ఇబ్బందులు లేకుండా ఎగువన ఉన్న కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడాలని నిర్ణయించారు. కర్ణాటకలోని నారాయణపూర్‌ నుంచి తెలంగాణ తాగునీటి అవసరాల కోసం కొంత నీటిని విడుదల చేయాలని మంత్రి నేతృత్వంలో త్వరలో ఒక బృందాన్ని ఆ రాష్ట్రానికి పంపాలని సూచించారు. గతంలో కూడా రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి ఏర్పడినప్పుడు కర్ణాటక సహకారం అందించిన దాఖలాలున్నాయని.. ఇప్పుడు ఆ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉండటం కలిసి వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags

Next Story