GROUP 1: గ్రూప్ 1 మెయిన్స్‌కు 1:100 కష్టమే!
తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షకు ఒక్కో పోస్టుకు 1: 50 నిష్పత్తి చొప్పున కాకుండా 1: 100 చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేయాలనే డిమాండ్ పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. అధికారులు, విద్యార్ధి నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. గత ప్రభుత్వం 2022లో వేసిన గ్రూప్ 1 పరీక్ష పేపర్ల లీకేజీ, తప్పుడు నిర్ణయాల కారణంగా రెండు సార్లు వాయిదా పడిందని, కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే సుప్రీంకోర్టులో ఉన్న ఈ పిటిషన్ వెనక్కి తీసుకుందని అధికారులు.. సీఎంకు వివరించారు. పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసి అదనంగా మరిన్ని పోస్టులతో కొత్త నోటిఫికేషన్ జారీ చేసిందని చెప్పారు. పన్నెండేండ్ల తర్వాత చేపట్టిన గ్రూప్ 1 పరీక్షకు నాలుగు లక్షల మంది అభ్యర్థులు పోటీ పడ్డారని.. ఇటీవలే ప్రిలిమినరీ పరీక్షను టీజీపీఎస్‌సీ పకడ్బందీగా నిర్వహించిందని చెప్పారు.
నోటిఫికేషన్ ప్రకారం ప్రిలిమ్స్ లో మెరిట్ ఆధారంగా ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్ కు ఎంపిక జరుగుతుందని వివరించారు. ఇప్పుడు 100 మందిని ఎంపిక చేసేలా నిబంధనలను సవరిస్తే కోర్టులు జోక్యం చేసుకునే ప్రమాదముందని, అదే జరిగితే మొత్తం నోటిఫికేషన్ మళ్లీ నిలిచిపోతుందని అధికారులు వివరించారు. నోటిఫికేషన్‌లో ఉన్న నిబంధనలను మార్చితే న్యాయపరంగా చెల్లుబాటు కాదని సీఎంకు వివరించారు. గ్రూప్ 1 పరీక్ష రెండోసారి రద్దయినప్పుడు హైకోర్టు చేసిన వ్యాఖ్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అప్పటి నోటిఫికేషన్‌లో ఉన్న బయో మెట్రిక్ పద్ధతిని ఎందుకు పాటించ లేదనే ఏకైక కారణంతో తెలంగాణ హైకోర్టు పరీక్షను రద్దు చేసిందని గుర్తు చేశారు. 1999లో యూపీఎస్‌సీ వర్సెస్ గౌరవ్ ద్వివేది కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉదాహరించారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న దానికంటే ఎక్కువ మందికి అవకాశమిస్తే.. ముందుగా ఉన్నవాళ్లకు అన్యాయం జరిగినట్లే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు.
గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల పెంపు మీద కూడా చర్చ జరిగింది. పరీక్షల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో పోస్టులు పెంచటం కూడా నోటిఫికేషన్ ను ఉల్లంఘించినట్లే అవుతుందని, అప్పుడు కూడా కోర్టులు జోక్యం చేసుకునే పరిస్థితి ఉంటుందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. గ్రూప్ 1 కు కొత్త నోటిఫికేషన్ ఇచ్చినందున పోస్టుల సంఖ్య పెంచటం సాధ్యమైందని, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లకు అలాంటి వెసులుబాటు లేదని చెప్పారు. గ్రూప్ 2, డీఎస్సీ పరీక్షలు ఒకదాని వెంటే ఒకటి ఉండటంతో అభ్యర్థులు నష్టపోతున్నారని విద్యార్థి సంఘం నాయకులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. జులై 17నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు ఉన్నాయని, ఆ వెంటనే 7, 8 తేదీల్లో గ్రూప్ 2 ఉండటంతో ప్రిపరేషన్‌ను ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. పరీక్షల తేదీల విషయంలో టీజీపీఎస్‌సీ, విద్యాశాఖతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని సీఎం వారికి హామీ ఇచ్చారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com