CM Revanth Reddy : నేటి సాయంత్రం నుంచి ఋణ మాఫీ, సంబరాలు చేయమన్న రేవంత్

మూడు విడతల్లో రైతు రుణమాఫీ పూర్తి చేస్తామని ప్రకటన

రూ.లక్ష వరకు ఉన్న రుణమాఫీ సొమ్ము రూ.7 వేల కోట్లు గురువారం సాయంత్రం 4 గంటలకు నేరుగా రైతుల రుణఖాతాల్లో జమ అవుతాయని.. ఈ విషయాన్ని ప్రతి ఓటరుకు కాంగ్రెస్‌ నేతలు సగర్వంగా చెప్పాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ‘‘నా జీవితంలో ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. ఈ నెలాఖరులోగా రూ.లక్షన్నర వరకు, ఆగస్టులో రూ.2 లక్షల వరకు రుణమాఫీతో ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం. ఈ విషయాన్ని పోలింగ్‌ బూత్‌స్థాయి వరకు ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరికి వివరించండి. ఎక్కడికక్కడ పండగ వాతావరణంలో సంబరాలు జరపండి’’ అని ఆయన నిర్దేశించారు. ‘‘రైతులందర్నీ రుణ విముక్తులను చేయాలన్నదే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యం. కేసీఆర్‌లా మాటలు చెప్పి రైతులను మభ్యపెట్టడం లేదు. చిత్తశుద్ధితో ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తున్నాం. దీనిపై జాతీయస్థాయిలో చర్చ జరగాలి. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఒకే విడతలో రూ.31 వేల కోట్లతో రుణమాఫీ చేయలేదు. రాహుల్‌గాంధీ ఇచ్చిన గ్యారంటీ హామీని అమలు చేశామని పార్లమెంటులో ఎంపీలు ప్రస్తావించాలి. దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలవాలి. వ్యవసాయ విధానంలో తెలంగాణ నమూనాను దేశం అనుసరించేలా ఉండాలి’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

రుణమాఫీ అమలు చేసేందుకు నిద్రలేని రాత్రులు గడిపామని, రూపాయి.. రూపాయి పోగుచేసి ఇస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క అన్నారు. రేషన్‌కార్డులు లేని సుమారు ఆరు లక్షల మంది సహా అన్ని రైతు కుటుంబాలకు రుణమాఫీ చేస్తామన్నారు. ప్రతి ఓటరు దగ్గరకు వెళ్లి.. తలెత్తుకొని ప్రచారం చేయాలని నేతలకు సూచించారు. గతంలో మిగులు బడ్జెట్‌తో అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ ప్రభుత్వం రూ.లక్ష రుణమాఫీని నాలుగు దఫాలుగా పూర్తిచేసిందని, రూ.ఏడు లక్షల కోట్ల అప్పులతో అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ రూ.రెండు లక్షల వరకూ రుణమాఫీని నెలల వ్యవధిలోనే అమలు చేస్తోందని ఆయన చెప్పారు. హామీలు అమలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో అనుకున్నంతగా ప్రచారం జరగడం లేదన్నారు.

కీలకమైన పీసీసీ సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు, పీసీసీ ఆఫీస్‌ బేరర్లు హాజరు కాకపోవడంపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి 57 మంది శాసనసభ్యులు మాత్రమే హాజరయ్యారు. సమావేశానికి రాని ఎమ్మెల్యేలు, పీసీసీ ఆఫీస్‌ బేరర్ల జాబితాను గురువారంలోగా తనకివ్వాలని పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు టి.కుమార్‌రావుకు సూచించారు. సమావేశం అనంతరం ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్‌ కౌశిక్‌ యాదవ్, అధికార ప్రతినిధి లోకేశ్‌ యాదవ్, గౌరీ సతీశ్‌ తదితరులు ప్రజాభవన్‌ ఆవరణలో సీఎం, ఉప ముఖ్యమంత్రిల ఫొటోలున్న ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.

Tags

Next Story