TS: దావోస్‌కు రేవంత్‌రెడ్డి బృందం

తెలంగాణకు భారీ పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం దావోస్ పయనమైంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూల అంశాలను, ప్రాధాన్యాన్ని బృందం వివరించనుంది. పర్యటనలో 70మందికిపైగా పారిశ్రామికవేత్తలను ముఖ్యమంత్రి బృందం కలిసి పలు అంతర్జాతీయ స్థాయి కంపెనీల CEOలతో సమావేశం కానుంది. కీలక అంశాల్లో పెట్టుబడులపై ఒప్పందాలు చేసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరానికి వెళ్ళే బృందానికి మొదటిసారి CM హోదాలో రేవంత్ రెడ్డి నేతృత్వం వహిస్తున్నారు.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అనుకూలతలు , ప్రాధాన్యతలను వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదిక ద్వారా చాటి చెబుతామని ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఈనెల 15 నుంచి 19 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం 54వ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు సీఎం నేతృత్వంలో అధికారిక బృందం పర్యటనకు సిద్ధమైంది. ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశానికి వెళ్తున్న రాష్ట్ర అధికారిక బృందానికి ముఖ్యమంత్రి నేతృత్వం వహించడం ఇదే మొదటిసారి అని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఈ బృందంలో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శితో పాటు ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి ఉన్నారు.
CM REVANTH REDDY TEAM GOS DAVOSవిదేశీ, భారతీయ పారిశ్రామికవేత్తలను కలుసుకొని ప్రభుత్వ విజన్, ప్రాధాన్యతలను వివరించడానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం అవకాశం ఇస్తుందని సర్కార్ భావిస్తోంది. ఐటీ రంగంలో అగ్రగామిగా, లైఫ్ సైన్సెస్ రంగానికి హబ్‌గా ఉన్న తెలంగాణ ప్రాధాన్యాన్ని ప్రపంచానికి తెలియజెప్పేందుకు ఇదొక చక్కటి వేదికగా కానుందని సీఎం భావిస్తున్నారు . మూడు రోజుల దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు, అధికారుల బృందం దాదాపు 70 మందికి పైగా పారిశ్రామిక దిగ్గజాలను కలవబోతోంది. నొవర్తీస్, మెడ్ ట్రానిక్స్, ఆస్ట్రాజనిక, గూగుల్, ఉబర్, మాస్టర్ కార్డ్, బేయర్, LDC, UPL తదితర అంతర్జాతీయ కంపెనీల CEOలు కలవనున్నట్లు శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. భారత్‌కు చెందిన టాటా, విప్రో, HCL టెక్, JSW, గోద్రెజ్, ఎయిర్ టెల్, బజాజ్ వంటి సంస్థల ప్రతినిధులతోనూ భేటీ అవ్వడమే కాకుండా CII, నాస్కం వంటి వ్యాపార ఛాంబర్స్ ప్రతినిధులతో భేటీ అవుతామని వివరించారు. ఫార్మా, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, డిఫెన్స్, ఏరోస్పేస్, ఆహార శుద్ధి, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో పెట్టుబడుల ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం ఉందని శ్రీధర్‌బాబు వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com