CM Revanth Warangal Tour : నేడు వరంగల్ కు సీఎం రేవంత్​ రెడ్డి

CM Revanth Warangal Tour : నేడు వరంగల్ కు సీఎం రేవంత్​ రెడ్డి
X
కీలక హామీలపై ప్రకటన ?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన ఖరారు అయ్యింది. ఎలక్షన్​ కోడ్​ ముగిసిన తరువాత వరంగల్ నగరానికి ముఖ్యమంత్రి వస్తుండగా, ఆయన టూర్​ పైనే ఓరుగల్లు ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే నగరానికి సంబంధించిన ముఖ్యమైన పనులు పెండింగ్​ లో ఉండగా, వాటికి మోక్షం కలుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పెండింగ్​ పనులతో పాటు జిల్లాకు కావాల్సిన కొత్త పనులకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా రెడీ చేశారు.

సీఎం రేవంత్​ రెడ్డి వరంగల్ లో దాదాపు ఐదు గంటల పాటు సుడిగాలి పర్యటన చేయనున్నారు. తన పర్యటనలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 12.40 గంటలకు శంషాబాద్​ ఎయిర్​ పోర్టు నుంచి హెలిక్యాప్టర్​ లో బయలు దేరనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటల వరకు వరంగల్ జిల్లా సంగెం మండలంలోని కాకతీయ మెగా టెక్స్​ టైల్​ పార్కుకు చేరుకుని, అక్కడ వివిధ కంపెనీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్​ ను 1.50 గంటల వరకు సందర్శిస్తారు. అక్కడి నుంచి వరంగల్​ సెంట్రల్​ జైల్​ స్థలంలో నిర్మిస్తున్న మల్టీ సూపర్​ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను పరిశీలిస్తారు.

అక్కడి నుంచి 2.45 గంటల ప్రాంతంలో హనుమకొండలోని ఇంటిగ్రేటెడ్​ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్​ కాంప్లెక్స్ కు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు ఏర్పాటు చేసిన మహిళా శక్తి క్యాంటీన్​ ను ప్రారంభిస్తారు. అనంతరం కలెక్టరేట్​ కాన్ఫరెన్స్​ హాలులో జీడబ్ల్యూఎంసీ అభివృద్ధి పనులపై అధికారులతో రివ్యూ చేస్తారు. ఆ తరువాత 5.30 గంటల ప్రాంతంలో వరంగల్ హంటర్​ రోడ్డులో కొత్తగా ఏర్పాటైన ‘మెడి కవర్’ అనే ప్రైవేటు ఆసుపత్రి ఓపెనింగ్​ కు చీఫ్​ గెస్ట్​ గా హాజరవుతారు.

అక్కడి నుంచి 6.10 గంటలకు ఆర్ట్స్​ కాలేజీ గ్రౌండ్​ లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్​ కు చేరుకుని హైదరాబాద్​ కు తిరుగుప్రయాణం కానున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటనకు జిల్లా అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. తమతమ శాసనసభ నియోజకవర్గాల పరిధిలో జరిగే కార్యక్రమాలకు సంబంధించిన పనులను స్థానిక ఎమ్మెల్యేలు పరిశీలించారు. వరంగల్ నగరానికి సంబంధించి ముఖ్యమైన పనులు చాలా వరకు పెండింగ్​ లోనే ఉన్నాయి. రాష్ట్రానికి రెండో రాజధానిగా వరంగల్ ను తీర్చిదిద్దుతామని ఇదివరకే సీఎం రేవంత్​ రెడ్డి ప్రకటన చేయగా, తన పర్యటనలో భాగంగా ఏమేం పనులు మంజూరు చేస్తారోనని ఆసక్తి నెలకొంది.

Tags

Next Story