TELANGANA: త్వరలో మంత్రివర్గ విస్తరణ

త్వరలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి ఈ విషయమై అధిష్ఠానంతో చర్చించేందుకు రేపు ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. నామినేటెడ్ పదవుల భర్తీపైన చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికలకు ముందు పార్టీలో జోరు పెంచేందుకు పదవుల పంపిణీ చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు. అందుకే మంత్రివర్గ విస్తరణతోపాటు నామినేటెడ్ పదవుల పంపకంపై అధిష్ఠానంతో చర్చించేందుకు సీఎం రేపు ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఓ జాబితా కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే మంత్రివర్గ విస్తరణలో గ్రేటర్ హైదరాబాద్‌కు తొలిప్రాధాన్యం ఇవ్వాలని సీఎం రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ ఒక్క చోటా కూడా గెలవలేదు. అయినప్పటికీ నాంపల్లి నుంచి పోటీ చేసి పరాజయం పాలైన ఫిరోజ్‌ఖాన్ మైనార్టీ కోటాలో మంత్రిపదవి ఆశిస్తున్నారు. నిజామాబాద్ అర్బన్‌లో ఓటమి చెందిన షబ్బీర్ అలీకి మంత్రిపదవి ఓకే అయితే ఫిరోజ్‌ఖాన్‌కు అవకాశం ఉండదని సమాచారం. మల్కాజిగిరి నుంచి పోటీచేసి ఓడిపోయిన మైనంపల్లి హన్మంతరావు కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. అయితే ఆయనను మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దింపాలని పార్టీలో ప్రచారం సాగుతోంది. అంజన్‌కుమార్ యాదవ్, మధుయాస్కీ ఎన్నికల్లో ఓడిపోయినా మంత్రి పదవి ఆశిస్తున్నారు. షబ్బీర్‌అలీ, అంజన్‌కుమార్‌లకు మంత్రులుగా అవకాశం లభిస్తే వారిని ఎమ్మెల్సీలుగా ఎంపిక చేస్తారని వారి అనుచరులు చెబుతున్నారు. ఆదిలాబాద్ నుంచి గడ్డం సోదరులు వినోద్, వివేక్‌లు మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఇద్దరూ నేతలు ఇప్పటికే దిల్లీలో అధిష్ఠానం పెద్దలను కలిసినట్లు తెలుస్తోంది. ఈసారి తనకు అవకాశం దక్కుతుందని వివేక్ ధీమాతో ఉన్నట్లు సమాచారం.
బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు కూడా కేబినెట్‌లో చోటుకోసం ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచిఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పేరు పరిశీలనలో ఉంది. అదే సమయంలో కీలకమైన హోం శాఖ ఎవరికైనా అప్పగిస్తారా లేక సీఎం వద్దనే ఉంచుకుంటారా అనే చర్చ విస్తృతంగా సాగుతోంది. అయితే ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులకు ఏడాది పాటు ఏ పదవీ కూడా ఇవ్వకూడదని పార్టీ యోచిస్తున్నట్టు కూడా మరో ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అధిష్ఠానం ఆ నిర్ణయానికి వస్తే ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయిన వారు మంత్రిపదవి ఆశలు వదులుకోక తప్పదని పార్టీ నేతలు చెబుతున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com