CM REVANTH: పైరసీ కట్టడికి ప్రత్యేక వింగ్ ఏర్పాటు!

సినిమా పరిశ్రమకు వేల కోట్ల రూపాయల నష్టం కలిగిస్తున్న పైరసీ ముఠాలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. డిజిటల్ మీడియాను హ్యాక్ చేసి, కాపీరైట్ రక్షణ ఉన్న సినిమాలను వివిధ వెబ్సైట్ల ద్వారా పంపిణీ చేస్తున్న ముఠాల ఆట కట్టిస్తున్నారు. తాజాగా, ప్రముఖ పైరసీ వెబ్సైట్ 'ఐబొమ్మ' నిర్వాహకుడు రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. నెల రోజుల క్రితమే బీహార్‌కు చెందిన అశ్వనీకుమార్ నేతృత్వంలోని మరో ముఠాను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విదేశాల నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న రవి, తన 'ఐబొమ్మ' వెబ్సైట్లో సుమారు 2,000 సినిమాలను అప్లోడ్ చేసి కోట్ల రూపాయలు ఆర్జించినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా, సుమారు 50 లక్షల మంది యూజర్ల డేటాను కూడా సేకరించినట్లు తేలింది. ఆయన వల్ల సినిమా పరిశ్రమకు వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. నెల రోజుల క్రితం పట్టుబడిన అశ్వనీకుమార్ ముఠా 2020 నుంచి దేశవ్యాప్తంగా దాదాపు 500 చిత్రాలను పైరసీ చేసింది. ఈ ముఠా వల్ల దేశంలోని వివిధ చిత్ర పరిశ్రమలకు కలిపి రూ.22,400 కోట్లు, ఒక్క తెలుగు పరిశ్రమకే రూ.3,700 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా. భారీ చిత్రాలు కూడా వీరి పైరసీ బారిన పడ్డాయి. హ్యాకింగ్ నిపుణుడైన అశ్వనీకుమార్.. బెట్టింగ్ యాప్‌లు, టెలిగ్రామ్ చానళ్ల ద్వారా పైరసీ కాపీలను విడుదల చేసేవాడని విచారణలో వెల్లడైంది.
ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి
పైరసీ సమస్యపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. ముఖ్యంగా సినీ పరిశ్రమకు భారీ నష్టాన్ని కలిగిస్తున్న పైరసీనిఅరికట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కఠిన కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. పైరసీని సమూలంగా అణచివేయడానికి ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. పైరసీ కారణంగా కేవలం సినీ పరిశ్రమకే కాక.. ఓటీటీ వేదికలకు, డిజిటల్ కంటెంట్ సృష్టికర్తలకు కూడా భారీ నష్టం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమస్యను సైబర్ నేరాల కోణం నుంచి చూస్తున్నారు. పైరసీతో పాటు ఇతర సైబర్ నేరాల నియంత్రణపై కూడా సీఎం దృష్టి సారించారు. ఈ విషయంలో పోలీస్ శాఖకు ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఐబొమ్మ రవి అరెస్టును తెలంగాణ ప్రభుత్వం ఒక ఛాలెంజ్‌గా తీసుకుంది. ఈ అరెస్టును కేవలం ఒక వ్యక్తిపై చర్యగా కాకుండా.. పైరసీపై ఉక్కుపాదం మోపేందుకు నాంది పలికినట్లుగా ప్రభుత్వం భావిస్తోంది. పైరసీ, డిజిటల్ కంటెంట్ దొంగతనాన్ని పర్యవేక్షించడానికి, తక్షణ చర్యలు తీసుకోవడానికి ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు. ఈ విభాగం సైబర్ క్రైమ్ బ్యూరో ఆధ్వర్యంలో పనిచేసే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

