REVANTH: తమాషాలు చేస్తే.. తాట తీస్తా

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ కాలేజీ యజమాన్యాలు కాలేజీల బంద్‌కు పిలుపునివ్వడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడితే ఉపేక్షించమని.. తమాషాలు చేస్తే తాట తీస్తామని హెచ్చరించారు. కాలేజీలు మూసివేస్తామంటే ఊరుకునేది లేదని.. విద్యను వ్యాపారం చేస్తామంటే కుదరదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం బకాయి పెట్టిన డబ్బు మమ్మల్ని ఉన్న పళంగా ఇవ్వమంటే ఎలా ఇస్తామని ప్రశ్నించారు. ‘‘మా హయాంలోని బకాయిలు ముందు చెల్లిస్తాం. విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆడొద్దు. బకాయిలు ఇవాళ కాకపోతే రేపు వసూలవుతాయి. కాలేజీలు బంద్ పెడితే విద్యార్థులు కోల్పోయిన సమయం తిరిగి వస్తుందా? రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులకు ఇబ్బంది లేదు. అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ వెళ్లాలి. రాష్ట్రానికి నెలకు రూ.18వేల కోట్ల ఆదాయం వస్తోంది. జీతాలు, వడ్డీలు, ఇతర ఖర్చులు పోనూ మిగిలేది రూ.5వేల కోట్లే. ఈ ఆదాయంతో రాష్ట్రాన్ని ఎలా నడపాలో చెప్పండి. ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారా?
కాలేజీలను బంద్ చేయించినవారితో చర్చించేదేముంది? ఏ కాలేజీ ఎంత డొనేషన్ వసూలు చేస్తుందో నాకు తెలుసు.” అని రేవంత్ తెలిపారు. విడతల వారీగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేస్తామని తెలిపారు. రూ.3 వేల కోట్ల బకాయిలు ఉంటే.. రూ.6 వేల కోట్లు ఇవ్వమంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లల భవిష్యత్ తో ప్రైవేట్ కాలేజీలు ఆటలాడొద్దని హెచ్చరించారు. విద్యార్థుల పట్ల ఓవరాక్షన్ చేస్తే సహించేదని వార్నింగ్ ఇచ్చారు. విద్యార్థులను ఇబ్బంది పెడ్తే.. ఏం చేయాలో మాకు కూడా తెలుసన్నారు. కాలేజీల్లో విద్యా ప్రమాణాలు పరిశీలించేందుకు అధికారులు వెళ్తే తప్పా అని నిలదీశారు. ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు అడిగినవి ఇవ్వనందుకు ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు. స్కూళ్లు, కాలేజీలు బంద్ పెట్టి నిరసన చేస్తే సహించేదని వార్నింగ్ ఇచ్చారు. విద్య అంటే వ్యాపారం కాదని.. విద్య అంటే సేవ అని అన్నారు. కానీ ఒక్కో కాలేజీ విచ్ఛలవిడిగా ఫీజులు పెంచుకుని వచ్చాయని.. ఆ కాలేజీల ఫీజులు లిస్ట్ చూస్తే నేనే షాక్ అయ్యానని అన్నారు.
బంద్ విరమించిన ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు
తెలంగాణలో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో చర్చల అనంతరం బంద్ విరమిస్తున్నట్టు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ప్రకటించింది. ప్రైవేటు కాలేజీలకు ఫీజు బకాయిలు చెల్లింపునకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. తక్షణమే రూ.600 కోట్లు విడుదలకు డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. మరో రూ.300 కోట్లు త్వరలో చెల్లించేందుకు హామీ ఇచ్చారు. నేటి నుంచి తెలంగాణలో యథావిధిగా విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. ఇదిలా ఉంటే.. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ హయాంలో రీయింబర్స్మెంట్ స్కీమ్ ప్రారంభమైంది. ఆ తరువాత సీఎంగా పనిచేసిన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరూ ఈ స్కీమ్‌ను కొనసాగించారు. గతంలోనూ రాష్ట్ర ప్రభుత్వం రూ.600 కోట్లు ఫీజు బకాయిలు చెల్లించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్, ఫార్మసీ తదితర వృత్తి విద్యా కళాశాలలతో పాటు డిగ్రీ, పీజీ కళాశాలలను 3 నుంచి బంద్ కారణంగా మూతబడ్డాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

