REVANTH: ఆగస్టు ఆఖరుకల్లా రూ. 2 లక్షల రైతు రుణమాఫీ

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. రైతు రుణమాఫీ కింద ఇప్పటికే రూ.6,093 కోట్లు మంజూరు చేశామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. రూ.1.50 లక్షల వరకు ఉన్న రైతుల రుణాలను జులై 31కి ముందే మాఫీ చేస్తామని వెల్లడించారు. ఆగస్టు 2 నుంచి 14 వరకు విదేశాల్లో పర్యటించనున్నానని.. తిరిగి రాగానే రూ.2 లక్షల రుణమాఫీ కూడా చేసి రైతుల రుణం తీర్చుకుంటానని రేవంత్ తెలిపారు. రుణమాఫీ చేసి చూపించాలని బీఆర్ఎస్ నేతలు సవాల్ విసిరారని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఆగస్టులోపే రుణమాఫీ చేస్తామని, జులై 31లోపే రూ.1.50 లక్షల్లోపు రైతు రుణాలు మాఫీ చేయనున్నట్లు తెలిపారు. ఆగస్టు ఆఖరుకల్లా రూ.2 లక్షల్లోపు రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. కాంగ్రెస్ హయాంలో పేదలకు కష్టాలు వచ్చాయని బీఆర్ఎస్ నేతలు అంటున్నారని, పేదలకు ఎవరికీ కష్టాలు రాలేదని, కేసీఆర్ కుటుంబానికి కష్టాలు వచ్చాయని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు. అధికారం పోయిందనే బాధ కేసీఆర్‌లో స్పష్టంగా కనిపిస్తోందని, ప్రజలు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను చిత్తుగా ఓడించారని పేర్కొన్నారు.
కల్వకుర్తిని అభివృద్ధి చేస్తానని ఎన్నికల సభలో చెప్పానని సీఎం రేవంత్ గుర్తు చేసుకున్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని, కల్వకుర్తిలో ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్, రోడ్ల కోసం రూ.180 కోట్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. కల్వకుర్తిలో నిరుద్యోగితను పారదోలడానికి స్కిల్ సెంటర్, ఆమన్‌గల్‌లో డిగ్రీ కళాశాల మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మాడుగల మండల కేంద్రంలో అండర్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. కల్వకుర్తి ప్రజలతో వాదించి గెలవడం కష్టమని, ప్రజా సమస్యల పరిష్కారంలో కల్వకుర్తి ప్రజాప్రతినిధులకు ప్రత్యేకత ఉందని సీఎం రేవంత్ కొనియాడారు. కల్వకుర్తి ప్రజాప్రతినిధుల్లో జైపాల్‌రెడ్డి నేర్పించిన విలువలు కనిపిస్తుంటాయని పేర్కొన్నారు. తల్లిని చంపి బిడ్డను కాపాడారు అని ప్రధాని మోదీ ఆరోపణ చేశారని సీఎం గుర్తు చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానానికి ప్రత్యేక తెలంగాణ ప్రాధాన్యతను జైపాల్‌రెడ్డి వివరించారని రేవంత్ పేర్కొన్నారు.
2014లో సీఎం అభ్యర్థిగా జైపాల్ రెడ్డిని ప్రకటించి ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కల్వకుర్తిలో ఏర్పాటు చేసిన జైపాల్‌రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com