REVANTH: పంట రుణాల మాఫీపై రేవంత్ కీలక ప్రకటన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. పంట రుణాల మాఫీ విషయంలో రేషన్‌కార్డు నిబంధనపై రేవంత్‌రెడ్డి స్పష్టత ఇచ్చారు. పాస్‌బుక్ ఆధారంగానే రూ.2లక్షల రుణమాఫీ ఉంటుందని వెల్లడించారు. కుటుంబాన్ని గుర్తించేందుకే రేషన్‌కార్డు నిబంధన పెట్టినట్లు చెప్పారు. ఈ నెల 18న రూ.లక్ష లోపు రుణాలు మాపీ చేయనున్నట్లు తెలిపారు. ఎల్లుండి సాయంత్రంలోగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామన్నారు. రుణమాఫీ సంబురాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. రుణ మాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కలెక్టర్ల సమావేశంలో రుణమాఫీ మార్గదర్శకాలపై సీఎం వివరించారు.
ఇప్పటికే పంట రుణాల మాఫీకి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. పథకం అమలు విధి విధానాలను వివరిస్తూ జీవో నంబరు 567ను జారీ చేసింది. ఒక రైతు కుటుంబానికి గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు రుణాలను మాఫీ చేయనుంది. రైతు కుటుంబం గుర్తింపునకు తెల్లరేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోనున్నట్లు ప్రకటించింది. అన్ని షెడ్యూల్డు, వాణిజ్య, ప్రాంతీయ గ్రామీణ, జిల్లా సహకార బ్యాంకుల నుంచి 2018 డిసెంబరు 12 నుంచి మంజూరైన, రెన్యువలైన రుణాలకు, 2023 డిసెంబరు 9 వరకు బకాయి ఉన్న పంట రుణాలకు, స్వల్పకాలిక రుణాలకు ఇది వర్తిస్తుందని, రుణాల అసలు, దానికి వర్తించే వడ్డీని కలిపి రూ.2 లక్షలు మాఫీ అవుతాయని ప్రభుత్వం తెలిపింది. అయితే తెల్లరేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోనున్నట్టు ప్రకటించటంతో విపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రేషన్ కార్డు నిబంధనపై సీఎం స్పష్టత ఇచ్చారు.
ఒక్కో రైతు కుటుంబానికి 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9వ తేదీ మధ్య ఉన్న పంట రుణాల బకాయిల్లో రూ.2 లక్షల వరకు మాఫీ చేయనున్నట్టు ప్రకటించింది. తప్పుడు పత్రాలతో రుణమాఫీ పొందినట్టు తేలితే ఆ మొత్తాన్ని రికవరీ చేస్తామని తెలిపింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు సోమవారం ‘పంట రుణ మాఫీ పథకం–2024’ మార్గదర్శకాలను విడుదల చేశారు. ఈ ఉత్తర్వులను తెలుగులో విడుదల చేయడం విశేషం. వ్యవసాయశాఖ డైరెక్టర్, ఎన్‌ఐసీ సంయుక్తంగా ఈ పథకం అమలు కోసం ఒక ఐటీ పోర్టల్‌ను నిర్వహిస్తాయి. ఈ పోర్టల్‌లో ప్రతి రైతు కుటుంబానికి సంబంధించిన లోన్ అకౌంట్ డేటా సేకరణ, డేటా వాలిడేషన్, అర్హత మొత్తం నిర్ణయించబడుతుంది. ఈ ఐటీ పోర్టల్‌లోనే.. ఆర్థికశాఖ నిర్వహించే ఐఎఫ్‌ఎంఐఎస్‌కు బిల్లులు సమర్పించడానికి, రుణమాఫీ పథకానికి సంబంధించిన భాగస్వాములందరితో సమాచారాన్ని పంచుకోవడానికి, రైతులు ఇచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేకంగా మాడ్యూల్స్ ఉంటాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com