REVANTH: సీట్లు తగ్గితే తిరుగుబాటు వస్తుంది: రేవంత్

REVANTH: సీట్లు తగ్గితే తిరుగుబాటు వస్తుంది: రేవంత్
X
ఎంపీ సీట్ల తగ్గుదలను అంగీకరించేదే లేదన్న ముఖ్యమంత్రి

లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనాభా లెక్కల ప్రాతిపదికన.. దక్షిణాదిలో లోక్ సభ సీట్లు తగ్గిస్తే అది తీవ్ర సంక్షోభానికి, తిరుగుబాటుకు దారితీస్తుందని రేవంత్ హెచ్చరించారు. ఎంపీ సీట్ల తగ్గుదలను అసలు అంగీకరించే ప్రశ్నే లేదని..దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తే సహించేది లేదని తెల్చి చెప్పారు. దక్షిణాదిని రాజకీయంగా నిర్వీర్యం చేయాలని బీజేపీ చూస్తోందని మండిపడ్డారు. కుటుంబ నియంత్రణ విధానాలను పటిష్ఠంగా అమలు చేసినందున దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గిందని, సరిగా అమలు చేయని ఉత్తరాదిలో విపరీతంగా పెరిగిందని సీఎం తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంటు సీట్లు తగ్గవని కేంద్రమంత్రి అమిత్‌షా అంటున్నారని.. అంటే ఏమీ పెరగవని కూడా అర్థమని రేవంత్ అన్నారు. తెలంగాణలో ఇప్పుడున్న 17 లోక్‌సభ స్థానాలకు 9 అదనంగా పెరగాలని... లేకపోతే 1971 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని రేవంత్ సూచించారు.

దక్షిణాది రాష్ట్రాల్లో టెన్షన్.. టెన్షన్

దక్షిణాది రాష్ట్రాలకు ‘నియోజకవర్గాల పునర్విభజన’ టెన్షన్ వెంటాడుతోంది. 2026 నాటికి రాజ్యాంగబద్ధంగా నిర్దేశించిన నియోజకవర్గ పునర్విభజన ప్రక్రియ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం తగ్గిపోవడమే కాక, నిధుల కేటాయింపులో కూడా తేడాలు వస్తాయని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. పునర్విభజన పేరుతో దక్షిణాది రాష్ట్రాలపై కత్తి వేలాడుతోందని తీవ్రంగా విమర్శిస్తున్నాయి.

మార్చి 5 అఖిలపక్ష భేటీ

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన విషయమై మార్చి 5న అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గాల పునర్విభజన విషయమై తమిళనాడు అతిపెద్ద హక్కు పోరాటం నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. మార్చి 5న అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నామని, ఎన్నికల కమిషన్‌లో నమోదు చేసుకున్న 40 పార్టీలను ఆహ్వానించాలని నిర్ణయించామని తెలిపారు.

Tags

Next Story