REVANTH: రైతులను బీఆర్ఎస్, బీజేపీ ఆగం చేస్తున్నాయ్

తెలంగాణలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 25.50 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. " అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రూ.21 వేల కోట్ల రుణమాఫీ జరిగిందా? లేదా? బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు గుండెల మీద చెయ్యి వేసుకుని మీ మనస్సాక్షినే అడగండి" అని రేవంత్ వ్యాఖ్యానించారు. మనసులేని బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటై రైతులను ఆగం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. వనపర్తిలో పర్యటించిన రేవంత్.. పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ‘ప్రజాపాలన-ప్రగతి బాట’ బహిరంగ సభలో పాల్గొన్నారు.
విపక్షాలకు రేవంత్ సవాల్
వనపర్తి రైతులకు రూ. 7 వేల కోట్ల రైతు రుణమాఫీ మంజూరు చేసినట్టు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కావాలంటే స్వయంగా బ్యాంకుకు వెళ్ళి చెక్ చేసుకోవచ్చని విపక్షాలకు సవాల్ విసిరారు. గతంలో వనపర్తి రాజకీయాల్లో ధన ప్రభావం లేదన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో అప్పటి ఎమ్మెల్యే నిరంజన్ రెడ్డి ఇక్కడి రాజకీయాలను కలుషితం చేశారని మండిపడ్డారు. వనపర్తి తనకు చదువుతో పాటు సంస్కారం నేర్పించిందని రేవంత్ అన్నారు. వనపర్తి విద్యార్థిగా తెలంగాణకు వన్నెతెచ్చాడనే కీర్తి తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ‘వనపర్తికి వస్తే పాత జ్ఞాపకాలు, స్నేహితులు, ఈ ప్రాంతం నాకిచ్చిన స్పూర్తి గుర్తుకొస్తాయి. వనపర్తి నాకిచ్చిన చదవు, సంస్కారం, రాజకీయ చతురత, ఇక్కడ ఉన్న లక్షలాది మంది సాక్షిగా చెబుతున్నా పాలమూరు రుణం తీర్చుకుంటా. కేసీఆర్, కేటీఆర్, హరీష్, కిషన్ రెడ్డి, కవిత ఎవరైనా లెక్కపెట్టేదే లేదు. పాలమూరును పసిడిపంటల జిల్లాగా మార్చే బాధ్యత నాది’. అని సీఎం హామీ ఇచ్చారు.
ఆయన కోసం ఆ పథకాన్ని అమలు చేస్తా
కాశింనగర్ ఎత్తిపోతల పథకాన్ని అమలు చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘4000 ఎకరాలకు నీళ్లు రావాలంటే కాశింనగర్ ఎత్తిపోతల పథకం ఇవ్వాలని అడగడమే కాదు, దానికి డా. మాధవరెడ్డి పేరు పెట్టాలని డా. చిన్నారెడ్డి కోరారు. ఉస్మానియాకు మహబూబ్ నగర్, వనపర్తి నుంచి ఎవరు వెళ్లినా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా బతికినంత కాలం పేదలకు మాధవరెడ్డి వైద్యం చేశారు’ అని రేవంత్ తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నామని... రూ.200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని గుర్తు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com