SLBC: ఎస్ఎల్‌బీసీ పాపం బీఆర్ఎస్ ప్రభుత్వానిదే

SLBC: ఎస్ఎల్‌బీసీ పాపం బీఆర్ఎస్ ప్రభుత్వానిదే
X
టన్నెల్లో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం రేవంత్... గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం

గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం.. SLBCని అస్సలు పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ‘2014 తెలంగాణ ఏర్పడే నాటికి 32 కిలోమీటర్ల టన్నెల్‌ పూర్తైంది. కానీ, గత ప్రభుత్వం SLBCని పట్టించుకోలేదు. ఈ పనులు చేస్తున్న సంస్థ కరెంట్ బిల్లులు చెల్లించలేదని సప్లయ్ కూడా నిలిపివేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఆగిపోయిన పనులను ప్రారంభించాం. అయితే, అనుకోకుండా ఈ దుర్ఘటన జరిగింది' అని సీఎం తెలిపారు. SLBC టన్నెల్ ను రేవంత్ రెడ్డి సందర్శించారు. ఫిబ్రవరి 22 నుంచి 8 మంది లోపల చిక్కుకున్న ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ లోపల 14వ కిలోమీటర్ వరకు వెళ్లి మరీ మంత్రులతో కలిసి పరిశీలించారు. రేవంత్ రెడ్డి వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి, ఎంపీ మల్లు రవి ఉన్నారు. రెస్క్యూ టీమ్ సిబ్బంది, అధికారులతో మాట్లాడి టన్నెల్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యల తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అక్కడ జరిగిన ప్రమాదంపై వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 'ఇది ప్రపంచంలోనే అతి పొడవైన టన్నెల్. మానవులు సృష్టించిన ఒక అద్భుతం ఈ SLBC టన్నెల్. అలాంటి దీనిలో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ప్రమాదం జరిగిన గంటలోపే స్పందించాం.' అని సీఎం అన్నారు.


ఆ పాపం బీఆర్ఎస్ దే

ఎస్ఎల్‌బీసీ పాపం బీఆర్ఎస్ ప్రభుత్వానిదే, కేసీఆర్ దేనని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఉత్తర తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తి చేసిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు.. దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులపై సవతి తల్లి ప్రేమ చూపించారని మండిపడ్డారు. పదేళ్లలో ఎస్‌ఎల్‌బీసీ మిగతా పనులు పూర్తి చేయని పాపం కేసీఆర్ దే అని, 8 మంది టన్నెల్ లోపల చిక్కుకుపోవడానికి గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు. కృష్ణా జలాలను ఏపీ ప్రభుత్వం రాయలసీమకు తీసుకుపోతుంటే చూస్తూ కూర్చున్నారని విమర్శించారు. . ఇలా ప్రమాదాలు జరగకుండా ఏం చేయాలో ఉన్నతాధికారులు దీనిపై ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వాలని సూచించారు.

ఉత్తమ్ కుమార్ గొప్పగా పని చేశారు

ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాద ఘటనలో తన కన్నా మంత్రి ఉత్తమ్ కుమార్ గొప్పగా పని చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 'ప్రమాదం జరిగిన వెంటనే యంత్రాంగమంతా ఘటనా స్థలానికి వెళ్లింది. టీమ్ లీడర్ గా నేను మా టీమ్ ని పర్యవేక్షించాను. ఆర్మీలో ఉన్న అనుభవంతో ఉత్తమ్ ఈ ఘటనను డీల్ చేశారు. ప్రతిపక్ష నేతలు మతి తప్పి నాపై విమర్శలు చేస్తున్నారు.' అని సీఎం రేవంత్ అన్నారు.

Tags

Next Story