REVANTH: ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తే చీల్చి చెండాడుతాం

తెలంగాణలో పదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని సర్కార్‌ను కూల్చే ప్రయత్నాలు చేస్తే, చీల్చి చెండాడుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. తెలంగాణకు అతిథిగా వచ్చిన ప్రధానిని గౌరవించడం మర్యాదని చెప్పిన సీఎం తెలంగాణ అభివృద్ధికి సహకరించకుంటే దేశమంతా తిరిగి మోడీపై పోరాడుతానని తెలిపారు. మహబూబ్‌నగర్‌లో జరిగిన కాంగ్రెస్ బహిరంగసభకు హాజరైన రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్, బీజేపీలపై విమర్శలదాడి చేశారు. తెలంగాణలో 14కు పైగా లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.
మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ MP అభ్యర్థి, CWC సభ్యుడు చల్లా వంశీచంద్‌రెడ్డి చేపట్టిన పాలమూరు న్యాయయాత్ర ముగింపు సభకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పార్టీ నేతలు పెద్దఎత్తున హాజరయ్యారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా పాలమూరుకు వచ్చిన రేవంత్‌రెడ్డికి పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. మహబూబ్‌నగర్ MVS కళాశాల మైదానంలో 'పాలమూరు ప్రజాదీవెన' పేరుతో జరిగిన సభలో ప్రసంగించిన సీఎం రేవంత్‌రెడ్డి.... రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతుందన్న ప్రతిపక్షాల వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పదేళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉండి తీరుతుందన్న రేవంత్‌రెడ్డి... కూలదోసే దమ్ము ఎవరికీ లేదన్నారు. ఎవరైనా తోక జాడిస్తే....కత్తిరించే కత్తెర తన వద్ద ఉందని తీవ్రస్థాయిలో హెచ్చరించారు..
మోడీ సభలో విజ్ఞప్తుల తీరుపై బీఆర్‌ఎస్ చేస్తున్న విమర్శల పట్ల మండిపడిన సీఎం.. తెలంగాణకు అతిథిగా వచ్చిన ప్రధానిని గౌరవించడం సంస్కారమన్నారు. తాను తలుపులు మూసి చెవిలో గుసగుసలాడలేదన్న రేవంత్‌రెడ్డి... తెలంగాణకు రావాల్సిన నిధులు, అనుమతులు ఇవ్వకపోతే... అన్ని రాష్ట్రాలు తిరిగి మోదీపై పోరాడుతానన్నారు. బీఆర్‌ఎస్ అంటే బిల్లా,రంగాల సమితిగా అభివర్ణించిన రేవంత్‌రెడ్డి.... దొరల గడీలు బద్దలు కొడతామన్న R.S.ప్రవీణ్... ఇవాళ కేసీఆర్ పక్కన చేరటం పాలమూరు ఆత్మగౌరవానికి మంచిదా... అని ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా బహిరంగసభ వేదికగా స్పష్టం చేశారు. పదేళ్లు అధికారంలోకి ఉన్న కేసీఆర్ ఇవాళ బీఎస్పీతో పొత్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎద్దేవా చేశారు. భాజపా-భారాస ఒక్కటేనన్న మంత్రి జూపల్లి... ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 2 ఎంపీ స్థానాల్లోనూ కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com