DAWOS: విప్రో ప్రతినిధులతో రేవంత్ కీలక భేటీ

దావోస్‌లో తెలంగాణ పెట్టుబడుల వేట కొనసాగుతోంది తెలంగాణను ఇండస్ట్రిల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు వేదికగా రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు బృందం పలు విదేశీ కంపెనీ ప్రతినిధులతో వరుసగా భేటీ అవుతున్నారు. నేడు తెలంగాణ పెవిలియన్‌లో సీఎం రేవంత్, విప్రో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో భాగంగా హైదారబాద్‌లోని గోపన్‌పల్లిలో కొత్త విప్రో సెంటర్‌ను ఏర్పాటు చేయబోతున్నామని రిషద్ ప్రేమ్‌జీ వెల్లడించారు. అందుకు సీఎం రేవంత్ ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ సహాయ, సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు.
భారీ పెట్టుబడులు
సన్ పెట్రో కెమికల్స్ తెలంగాణలో రూ.45,500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది. భారీ పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్లు సన్ పెట్రో కెమికల్స్ సంస్థ ప్రకటించింది. నాగర్‌కర్నూలు, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో మూడు చోట్ల పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ ప్రాజెక్టులను ఈ సంస్థ నెలకొల్పనుంది. ఈ ప్రాజెక్టుల నిర్మాణ దశలోనే దాదాపు 7,000 ఉద్యోగాలు లభించనున్నాయి. ఇప్పటివరకు దావోస్ వేదికపై తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న భారీ ఒప్పందం ఇదే. భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చిన సన్ పెట్రో కెమికల్స్ ప్రతినిధులను సీఎం అభినందించారు. సుస్థిరమైన ఇంధన వృద్ధి సాధించే తెలంగాణ లక్ష్య సాధనలో ఈ ఒప్పందం మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. భవిష్యత్తు ఇంధన అవసరాల దృష్ట్యా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీకి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని చెప్పారు.
నేటితో ముగింపు
సీఎం రేవంత్ రెడ్డి బృందం దావోస్ పర్యటన నేటితో ముగియనుంది. మధ్యాహ్నం 2.35కు ఆయన జ్యూరిచ్ నుంచి దుబాయ్‌కి చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా శుక్రవారం ఉదయం 8.25కు హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com