REVANTH: ఇసుక అక్రమ రవాణపై ఉక్కుపాదం

తెలంగాణలో ఇసుక అక్రమ రవాణను పూర్తిగా అరికట్టాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సరైన ధరలకు ఇసుకను సరఫరా చేస్తే.. వినియోగదారులు అక్రమ రవాణాపై ఆధారపడరని అధికారులకు సూచించారు. హైదరాబాద్ నగరానికి మూడు వైపులా ఇసుక స్టాక్ పాయింట్లు సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇసుకతో పాటు ఖనిజాల అక్రమ తవ్వకాలు, సరఫరాపై ఉక్కుపాదం మోపాలని స్పష్టం చేశారు. గనుల శాఖపై ఐసీసీసీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. గత నెల రోజులుగా తీసుకున్న చర్యలతో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడిన విధానాన్ని, పెరిగిన ఆదాయాన్ని అధికారులు సీఎంకు వివరించారు. ఇసుకతో పాటు ఇతర ఖనిజాల అక్రమ తవ్వకాలు, అక్రమ సరఫరాపై ఉక్కుపాదం మోపాలని రేవంత్ రెడ్డి సూచించారు. కఠిన చర్యలతోనే అక్రమాలను అడ్డుకోగలమని, ప్రభుత్వానికి ఆదాయం పెంచగలమన్నారు. ఈ సందర్భంగా ఇసుక రీచ్‌ల్లో తవ్వకాలు, రవాణా, వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక సరఫరాపై అధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.
అధికారులపై ప్రశ్నల వర్షం
గనుల శాఖ పరిధిలోని వివిధ ఖనిజాల క్వారీలకు గతంలో విధించిన జరిమానాలు, వాటి వసూళ్లపైనా సీఎం అధికారులను ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన విధానపరమైన నిర్ణయం త్వరగా తీసుకొని సమస్యను పరిష్కరించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మైనర్ ఖనిజాల బ్లాక్‌ల వేలానికి వెంటనే టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వంలోని నీటి పారుదల, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్‌తో పాటు వివిధ శాఖల ఆధ్వర్యంలో చేప్టటే పనులకు టీజీఎండీసీ నుంచే ఇసుక సరఫరా చేసేలా చూడాలన్నారు. పెద్ద మొత్తంలో నిర్మాణాలు చేపట్టే నిర్మాణ రంగ సంస్థలకు అవసరమైన ఇసుకను టీజీ ఎండీసీ ద్వారానే సరఫరా చేయాలని సీఎం ఆదేశించారు. సరైన ధరలకు ప్రభుత్వమే ఇసుక సరఫరా చేస్తే అక్రమంగా సరఫరా చేసే వారిపై వినియోగదారులు ఆధారపడరన్నారు. హైదరాబాద్ నగరంతో పాటు సమీప ప్రాంతాల్లోనే ఇసుక ఎక్కువగా వినియోగం జరుగుతోందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com