REVANTH: కృష్ణా జలాల్లో 70% వాటా ఇవ్వండి

REVANTH: కృష్ణా జలాల్లో 70% వాటా ఇవ్వండి
X
కేంద్ర జలశక్తి మంత్రికి రేవంత్ విజ్ఞప్తి.. ఏపీ నీటి తరలింపును అడ్డుకోవాలని వినతి

కృష్ణా జలాల్లో 70 శాతం వాటాను తెలంగాణకు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌కు విజ్ఞప్తి చేశారు. గోదావరికి సంబంధించి తెలంగాణ వాటా నికర జలాలను తేల్చిన తర్వాతే ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపాదించిన పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. కృష్ణా జలాలు సహా గోదావరి ప్రాజెక్టులపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతున్న వేళ రేవంత్‌ రెడ్డి... కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్​ పాటిల్‌తో కీలక చర్చలు జరిపారు. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డితో కలిసి సీఆర్​ పాటిల్‌తో రేవంత్‌రెడ్డి సమావేశమై.. పలు అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కృష్ణా పరీవాహక ప్రాంతం తెలంగాణలో ఎక్కువగా ఉన్నా.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పక్షపాతంగా ఆంధ్రప్రదేశ్‌కు 66%, తెలంగాణకు 34% నీటి కేటాయింపులు చేసిందని.. దీని వల్ల తాము ఏళ్లుగా నష్టపోతున్నామని రేవంత్ రెడ్డి.. కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఏపీకి నీటి తరలింపు జరగకుండా చూడటంతోపాటు కృష్ణా ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించి వెంటనే టెలిమెట్రీ యంత్రాలు ఏర్పాటు చేయాలని కోరారు.

బనకచర్లపై అభ్యంతరాలు

కృష్ణా బేసిన్‌లో ఏపీ ఎక్కువ నీటిని తీసుకుంటోందని, అలా తీసుకోకుండా అడ్డుకోవాలని కేంద్రాన్ని కోరామన్నారు. ఏపీ చేపడుతున్న బనకచర్లపై అభ్యంతరం తెలుపగా.. తప్పకుండా జోక్యం చేసుకుంటామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని సీఎం పేర్కొన్నారు. నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి ఏపీ తీసుకునే 10 వేల క్యూసెక్కులను 5 వేల క్యూసెక్కులకు తగ్గించేందుకు హామీ ఇచ్చారని వివరించారు. ముచ్చుమర్రి నుంచి కూడా తరలించకుండా ఆపుతామని చెప్పారన్నారు.​ గోదావరిపై ఏపీ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టు విషయాన్ని కూడా కేంద్ర మంత్రికి వివరించామన్నారు. అయితే ఆ ప్రాజెక్టుకు సంబంధించి తమకు ఎలాంటి ప్రతిపాదన, డీపీఆర్​ రాలేదని కేంద్ర మంత్రి అన్నారని తెలిపారు.

దానికి సిద్ధంగా లేం

తెలంగాణలో నికర జలాల ఆధారంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులకు కేటాయింపుల ప్రక్రియ వెంటనే చేపట్టాలని కోరినట్లు సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. కృష్ణా జలాల విషయంలో ఎదుర్కొంటున్న సమస్యను గోదావరిపైనా ఎదుర్కోడానికి తెలంగాణ సిద్ధంగా లేదని చెప్పారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించి తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తామని, ముంపునకు సంబంధించి మహారాష్ట్ర నుంచి అనుమతులు ఇప్పించాలని కోరారు. జలశక్తి మంత్రికి ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదం గురించి వివరించామన్నారు.

Tags

Next Story