REVANTH: ఇక స్థానిక సంస్థల ఎన్నికలు..

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. ఓటరు జాబితా పూర్తయిన వెంటనే నిర్ణీత గడువులోగా రిజర్వేషన్ల వివరాలు సమర్పించాలని బీసీ కమిషన్‌ను కోరారు. బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, బీసీ కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌తో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి అడ్డంకులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఓటర్ల జాబితా రావాల్సి ఉందని అధికారులు వెల్లడించగా... ఇంకా ఎంత సమయం పడుతుందని ప్రశ్నించారు. ఇప్పటికే రెండు రాష్ట్రాలకు ఈసీఐ జాబితాలు అందాయని, త్వరలోనే తెలంగాణతో పాటు మరో ఆరు రాష్ట్రాలకు రానున్నట్లు అధికారులు వివరించారు. జాబితా వచ్చిన వారం రోజుల్లోనే ఆయా స్థానిక సంస్థలకు అనుగుణంగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు. రిజర్వేషన్లకు సంబంధించిన నివేదికను బీసీ కమిషన్ గడువులోగా సమర్పించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పంచాయతీ, రాష్ట్ర ఎన్నికల కమిషన్, బీసీ కమిషన్ పనులు వెంటనే మొదలు పెట్టాలన్నారు. వీలైనంత త్వరగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రక్రియ పూర్తిచేయాలని తెలిపారు.
చేనేతలకు అండగా ఉంటామన్న సీఎం
చేనేత, పవర్ లూమ్ కార్మికులకు ఉపాధి కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15 తర్వాత అన్ని విభాగాల్లో ఏక రూప దుస్తులను తయారుచేసే వారితో సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. ఆర్టీసీ, పోలీస్, ఆరోగ్య విభాగాలకూ ప్రభుత్వ సంస్థల నుంచే దుస్తులు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని, తద్వారా కార్మికులకు మరింత ఉపాధి కలుగుతుందని అన్నారు. మహిళా శక్తి గ్రూప్ సభ్యులకు ఏక రూప దుస్తుల కోసం ప్రత్యేక డిజైన్‌ను రూపొందించాలని సూచించారు. నిజమైన కార్మికుడికి లబ్ధి చేకూరేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com