TG: కులగణన చేసి చరిత్ర సృష్టించాం: రేవంత్

రాష్ట్రవ్యాప్తంగా కులగణన చేసి చరిత్ర సృష్టించామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కులగణన జరపాలని ప్రధానిపై కూడా ఒత్తిడి వస్తోందని తెలిపారు. కులగణన, ఎస్సీ వర్గీకరణకు రోడ్ మ్యాప్ అందించామన్నారు. ప్రధాన ప్రతిపక్షానికి బాధ్యత లేదని విమర్శించారు. ప్రతిపక్ష నేత సభకు రావడం లేదని ఎద్దేవా చేశారు. బీసీ రిజర్వేషన్లపై కోర్టు ఆదేశాలతో కమిషన్ వేశామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో 96.9 శాతం కులగణన సర్వే పూర్తి చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘గత ఏడాది నవంబర్ 9వ తేదీ నుంచి 50 రోజుల పాటు ఈ సర్వే జరిగింది. డేటా ఎంట్రీ చేయడానికి 36 రోజులు పట్టింది. 75 అంశాల ప్రాతిపదికన సర్వే నిర్వహించాం. ఏడాదిలోపే సర్వేను విజయవంతంగా పూర్తి చేశాం. రాష్ట్రంలో మొత్తం 1.2 కోట్ల కుటుంబాలు సర్వేలో పాల్గొన్నాయి’ అని పేర్కొన్నారు.
తెలంగాణలో ముందే అమలు
దేశంలోని మిగిలిన రాష్ట్రాల కంటే ముందే తెలంగాణలో వర్గీకరణ అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో తెలిపారు. మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటాలు జరుగుతున్నాయి. వర్గీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎంతోమంది ముఖ్యమంత్రులకు రాని గొప్ప అవకాశం తనకు వచ్చిందని.. ఎస్సీ వర్గీకరణను అమలు చేయడం నాకు అత్యంత సంతృప్తినిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడే కాదు.. గతంలోనూ దళితులకు ఉన్నత పదవులు, అవకాశాలను కాంగ్రెస్ కల్పించిందని తెలిపారు. దళితుల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ నిరంతరం శ్రమిస్తుందని చెప్పారు. అంతకుముందు ఎస్సీ వర్గీకరణ తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ప్రవేశ పెట్టారు.
మొత్తం మూడు గ్రూపులు
15 శాతం ఎస్సీ రిజర్వేషన్లను 3 గ్రూపులకు పంచుతూ కమిషన్ సిఫారసు చేసింది. ఎస్సీల్లో మొత్తం 59 ఉప కులాలను గ్రూప్-1, 2, 3గా వర్గీకరించాలని కమిషన్ సిఫారసు చేసింది. గ్రూప్-1లోని 15 ఉపకులాలకు 1 శాతం రిజర్వేషన్, గ్రూప్-2లోని 18 ఎస్సీ ఉపకులాలకు 9శాతం రిజర్వేషన్, గ్రూప్-3లోని 26 ఉప కులాలకు 5శాతం రిజర్వేషన్ కల్పించాలని వర్గీకరణ కమిషన్ తన నివేదికలో పేర్కొంది. ఎస్సీ కులాల గ్రూప్‌లకు రోస్టర్ పాయింట్లు, క్రిమీలేయర్ విధానాన్ని కూడా అమలు చేయాలని కమిషన్ సిఫారసు చేసింది. దీనిని ప్రభుత్వం తిరస్కరించింది. ఎస్సీ వర్గీకరణ, కులగణన.. తన రాజకీయ జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చిన అంశమని రేవంత్ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com