REVANTH: ఈ వారంలోనే రూ.500లకు గ్యాస్‌ సిలిండర్‌

REVANTH: ఈ వారంలోనే రూ.500లకు గ్యాస్‌ సిలిండర్‌
ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి కొడంగల్‌లో రేవంత్‌ పర్యటన.... రూ.4.369 కోట్ల పనుల ప్రారంభం,...

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పర్యటించిన రేవంత్‌రెడ్డి 4 వేల 369కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. కొండగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. ఇప్పటికే 2 వేల 945 కోట్లతో ఈ ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. రోడ్ల విస్తరణ, గ్రామాలకు బీటీ రోడ్లు, జూనియర్ కళాశాలలు, హాస్టల్ భవన నిర్మాణాలు,పశు వైద్యకళాశాల, ఇంజినీరింగ్ కళాశాల, మెడికల్, నర్సింగ్, ఫిజియోథెరపీ కళాశాలలు,CHCని 220 పడకల ఆసుపత్రిగా ఉన్నతీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. కోస్గి బహిరంగసభలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి.. కేసీఆర్‌పై తీవ్ర విమర్శలుచేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు 27వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదన్నారు. పాలమూరు ప్రజలకు క్షమాపణ చెప్పినతర్వాతే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఓటు అడగాలని డిమాండ్‌ చేశారు.


వారంలో మరో రెండు హామీలు అమలు చేస్తామని రేవంత్ ప్రకటించారు.అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహిళా సంఘాలతో సమావేశమై వారితో చర్చించారు. మహిళా సంఘాలను బలోపేతం చేస్తామని తెలిపారు. ఐకేపీ, మహిళా సంఘాల ద్వారా పంటల కొనుగోళ్లు జరిపిస్తామని హామీ ఇచ్చారు. ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్‌ను ప్రకటించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌ను వారం రోజుల్లో అందించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. తెల్ల రేషన్‌కార్డు ఉన్న పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. వచ్చేనెల 15 నాటికి రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో డబ్బులు జమవుతాయన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత తమదేనని పేర్కొన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా కోస్గిలో నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల పథకం సహా రూ.4,369 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రులతో కలసి సీఎం శంకుస్థాపన చేశారు. 3,083 మహిళా సంఘాలకు రూ.177 కోట్ల విలువైన చెక్కును అందజేశారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించారు.


ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో కన్నా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మోదీ, కేసీఆర్‌ల పాలనలోనే తెలంగాణకు ఎక్కువ నష్టం జరిగిందని రేవంత్‌రెడ్డి అన్నారు. ఆనాడు జరిగిన నీటి దోపిడీ కన్నా కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక జరిగిందే ఎక్కువ. కమీషన్ల కోసమే ప్రాజెక్టులు చేపట్టారు. భీమా, నెట్టంపాడు, కోయిల్‌సాగర్‌, కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బీ, దేవాదుల, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులను డబ్బులు దండుకొని అసంపూర్తిగా వదిలేశారని రేవంత్‌రెడ్డి అన్నారు. రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేసినా పూర్తి కాలేదు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పేరుతో రూ.27 వేల కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరాకూ నీరు పారలేదని రేవంత్‌రెడ్డి అన్నారు. కరీంనగర్‌లో ఓడిపోతానన్న భయంతో పాలమూరుకు వలస వచ్చారన్నారు. ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంతానికి ఆయన ఏం చేశారు? ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రోజుకు 12 టీఎంసీల నీరు తరలించుకుపోతున్నా చూస్తూండిపోయారని రేవంత్‌రెడ్డి అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story