REVANTH: విద్యా ప్రమాణాలు పడిపోవడంపై సీఎం ఆవేదన

REVANTH: విద్యా ప్రమాణాలు పడిపోవడంపై సీఎం ఆవేదన
X
ప్రభుత్వ బడులతో పోలిస్తే ప్రైవేట్ పాఠశాలలు ఎందులో గొప్పని ప్రశ్న

తెలంగాణలో విద్యా ప్రమాణాలు పడిపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా ప్రమాణాలు పెంచేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలతో.. ప్రభుత్వ స్కూళ్లు ఎందుకు పోటీ పడడం లేదని రేవంత్ ప్రశ్నించారు. దీన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందని రేవంత్ అన్నారు. తమ ప్రభుత్వం 55 రోజుల్లోనే టీచర్ ఉద్యోగాలు భర్తీ చేసిందని గుర్తు చేశారు. బీఅర్ఎస్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్కూళ్లకు భవనాలే లేవని.. కానీ తమ ప్రభుత్వం 58 యంగ్‌ ఇండియా స్కూళ్లకు రూ.11 వేల కోట్లు కేటాయించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. వంద అసెంబ్లీ స్థానాల్లో యంగ్‌ ఇండియా స్కూళ్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తును విద్యాశాఖ తీర్చిదిద్దాలని ఆదేశించారు. గతంలో విద్యాశాఖ నిర్లక్ష్యానికి గురైందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. జూనియర్ లెక్చరర్‌, పాలిటెక్నిక్‌ లెక్చరర్ల ఉద్యోగాలకు ఎంపికైన 1,532 మందికి సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు.

వాళ్లకు సెలవు.. మీకు కొలువు

రవీంద్ర భారతి కళాశాలలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్నారు. ‘గత ప్రభుత్వ పెద్దల ఉద్యోగాలు తీసేస్తేనే.. మీకు ఉద్యోగాలు వస్తాయని గతంలో చెప్పాను. తండ్రి, కొడుకు, కూతురు ఉద్యోగాలను తొలిగించడం వల్లే మీకు ఉద్యోగాలు వచ్చాయి. నిరుద్యోగుల ద్వారా గతంలో గద్దెనెక్కి విర్రవీగారు. సంతలో సరుకులా ప్రశ్నాపత్రాలను అమ్మారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో నిరుద్యోగుల కృషి, పట్టుదల ఉన్నాయి’ అని పేర్కొన్నారు.

నిరుద్యోగులదే కీలక పాత్ర

నిరుద్యోగ సమస్య తెలంగాణ ఉద్యమాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లిందని, రాష్ట్ర సాధనలో నిరుద్యోగులు క్రియాశీల పాత్ర పోషించారని రేవంత్‌ అన్నారు. తెలంగాణ ఉద్యమానికి నిరుద్యోగులు పునాదులుగా మారారని పేర్కొన్నారు. గత ప్రభుత్వానికి ఉద్యమం పట్ల బాధ్యత లేక నిరుద్యోగ సమస్యకు పరిష్కారం దొరకలేదన్నారు. గత ప్రభుత్వ పెద్దల ఉద్యోగాలు తీస్తేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని తాను చెప్పినట్లు సీఎం గుర్తు చేశారు.

Tags

Next Story