REVANTH: గురుకులాలు.. బహుముఖ ప్రతిభకు కేంద్రాలు

గురుకులాలు అంటే బహుముఖ ప్రతిభకు కేంద్రాలు అనే గుర్తింపు తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా చిలుకూరులో గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు. గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో కామన్ డైట్‌ను ప్రారంభించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాలు, హాస్టళ్లలో ఒకే విధమైన మెనూ అమలు చేస్తున్నారు. పెంచిన డైట్ ఛార్జీలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త మెనూ రూపొందించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం మాట్లాడారు. గురుకులాల వ్యవస్థను పీవీ నరసింహారావు హయాంలో తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఇటీవలే డైట్ ఛార్జీలు పెంచామని గుర్తు చేశారు. గురుకులాల బాట కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నామని చెప్పారు.
విద్యాశాఖకు రూ.21 వేల కోట్లు
విద్యార్థుల కోసం చేస్తున్న ఖర్చును భవిష్యత్తు తరాల నిర్మాణానికి పెడుతున్న పెట్టుబడిగా భావిస్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ పెట్టుబడి తెలంగాణను బలోపేతం చేస్తుందని, అభివృద్ధి వైపు నడిపిస్తుందని, రాష్ట్ర ప్రతిష్ఠను నిలబెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యాశాఖకు రూ.21 వేల కోట్లు కేటాయించామని, భవిష్యత్‌లో ఇంకా నిధులు పెంచుతామన్నారు. విద్యాశాఖను గాడిలో పెట్టేందుకు ఆ శాఖను తానే స్వయంగా చూస్తున్నానని తెలిపారు. రానున్న రోజుల్లో నేను ఎక్కడికెళ్లినా రెసిడెన్షియల్ స్కూల్స్‌ను సందర్శిస్తానని తెలిపారు. విద్యార్థులకు పెట్టే భోజనాన్ని పరిశీలిస్తానని... ఎవరైనా తప్పిదాలకు పాల్పడితే వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. గురుకులాల విద్యార్థులు అనాథలు కాదని.... వాళ్లు రాష్ట్ర సంపద అని రేవంత్ రెడ్డి తెలిపారు. వారికి నాణ్యమైన విద్యతో పాటు మౌలిక వసతులు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. విద్యార్థులతో మెస్ మేనేజ్‌మెంట్ కమిటీలను ఏర్పాటు చేయాలని, వారు తినే ఆహారాన్ని వాళ్లే పర్యవేక్షించే వీలు కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
గొప్పవాళ్లు అయ్యారు
రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుకున్న వాళ్లు ఎంతోమంది గొప్పగా రాణించారని.. ఐఏఎస్, ఐపీఎ్‌సలుగా ఎంపికయ్యారని.. బుర్రా వెంకటేశం ఐఏఎస్, మహేందర్ రెడ్డి ఐపీఎస్.. రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులే అని చెప్పారు. విద్యావ్యవస్థను సమూల ప్రక్షాళన చేసి, విద్యా ప్రమాణాలు పెంచాలన్న దృఢ సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. పెరిగిన ధరలు, విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని డైట్ చార్జీలను 40 శాతం, కాస్మోటిక్ చార్జీలను 200 శాతం పెంచుతున్నామని.. దేశ చరిత్రలో ఒకేసారి ఇంత మొత్తం పెంచడం ఎక్కడా జరగలేదని రేవంత్ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com