కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య కోల్డ్‌వార్.. ఎవరికి వారే యమునా తీరే...!

కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య కోల్డ్‌వార్.. ఎవరికి వారే యమునా తీరే...!
X
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కోమటిరెడ్డి బ్రదర్స్‌గా ఈ ఇద్దరు అన్నదమ్ములు తెలుగు ప్రజలకు పరిచయం అక్కరలేని రాజకీయ నేతలు.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కోమటిరెడ్డి బ్రదర్స్‌గా ఈ ఇద్దరు అన్నదమ్ములు తెలుగు ప్రజలకు పరిచయం అక్కరలేని రాజకీయ నేతలు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకరు ఎమ్మెల్యే, మరొకరు ఎంపీ. నల్గొండ జిల్లాలో తిరుగులేని నాయకులుగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య ఇప్పుడు కోల్డ్‌వార్ నడుస్తోందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే చర్చ నడుస్తోంది. ఇటీవల వెంకట్‌రెడ్డి, రాజగోపాల్ రెడ్డి తీరు చూస్తే ఆ ప్రచారం నిజమనే అనుమానాలు కలుగుతున్నాయని కాంగ్రెస్ క్యాడరే చెప్పుకుంటున్నారు.

గత రెండుసార్లు తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారానికి దూరం కావడంతో హైకమాండ్‌పై కోమటిరెడ్డి బ్రదర్స్ తీవ్ర ఆరోపణలు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. గత కొంతకాలంగా ఈ అన్నదమ్ములిద్దరి వ్యవహారశైలి కూడా కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారిందనే వాదనలు పార్టీలో వినిపిస్తున్నాయి. ఇక.. రేవంత్‌రెడ్డి టీపీసీసీ చీఫ్‌గా ఎన్నికైన తర్వాత ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన ఆగ్రహాన్ని బాహాటంగానే వెళ్లగక్కారు. పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని తప్పుబడుతూ.. పీసీపీ పదవిని అమ్ముకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. పీసీసీ పదవిపై భారీ ఆశలు పెట్టుకున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కాదని రేవంత్‌రెడ్డికి ఇవ్వడంతోనే కాంగ్రెస్ హైకమాండ్‌పై వెంకట్‌రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని పార్టీ నేతలే చెప్పుకున్న పరిస్థితి.

ఇక.. అన్న వైఖరి ఇలా ఉంటే.. తమ్ముడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం మరోలా ఉంది. 2018 ఎన్నికల తర్వాత నుంచి మొన్నటి దాకా.. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యాన్మాయం బీజేపీ పార్టీయేనంటూ బహిరంగ వ్యాఖ్యలు చేసి హాట్‌టాపిక్ అయ్యారు. అయితే అందరూ ఇక రాజగోపాల్ రెడ్డి బీజేపీ పార్టీలోకి వెళ్లడం ఖాయమని భావించారు. ఏమైందో ఆ తర్వాత మాట మార్చారు. అంతేకాదు.. కాంగ్రెస్ నూతన పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకాన్ని అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే.. తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మాత్రం మద్దతు ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం సరైందేనంటూ రేవంత్‌రెడ్డిని, హైకమాండ్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇకపై కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టంచేశారు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.

ఏదిఏమైనా.. అన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యవహార శైలిపై తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గత కొంతకాలంగా గుర్రుగా ఉంటున్నారని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జోరుగా చర్చ నడుస్తోంది. అయితే ఈ అన్నదమ్ముల మధ్య పొలిటికల్ గ్యాప్‌ను పూడ్చడానికి కొందరు కాంగ్రెస్ సీనయర్లు ప్రయత్నాలు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఫైనల్‌గా బ్రదర్స్ ఇద్దరూ కలిసి నడుస్తారో..? లేకుంటే విడివిడిగానే ఉండిపోతారో..? వేచి చూడాల్సిందే.

Tags

Next Story